ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి | Punjab Ferozpur Road Accident News Updates | Sakshi
Sakshi News home page

ఊహించని మలుపు.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

Jun 6 2026 10:54 AM | Updated on Jun 6 2026 11:02 AM

Punjab Ferozpur Road Accident News Updates

ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఊహించని ప్రమాదం కబళించింది. అంత్యక్రియలు, అస్థికల నిమజ్జనం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం బారినపడింది. దీంతో ఆ కుటుంబంలోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌-ఫజిల్కా రహదారిపై ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జలాలాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలో ఇంటి పెద్ద(మహిళ) మరణించింది. దీంతో అంత్యక్రియలు, అనంతర కర్మలు పూర్తి చేసుకుని ఆ కుటుంబం పికప్‌ వాహనంలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 28 మంది వాహనంలో ఉన్నట్లు సమాచారం.

గత అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనం ఫిరోజ్‌పూర్‌-ఫజిల్కా మార్గంలో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర కొండ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్‌తో కొట్టింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పికప్‌ వాహనం అధిక వేగంతో వెళ్తుండటంతో డ్రైవర్‌ మలుపు వద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రైలర్‌ను తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి.

ఢీకొట్టిన తీవ్రతకు పికప్‌ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన పలువురిని ఫరీద్‌కోట్‌లోని ప్రత్యేక వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగం, ఇరుకు రహదారి, ప్రమాదకర మలుపు కలిసి ప్రమాదానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఇదే మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఫిరోజ్‌పూర్‌-ఫజిల్కా రహదారిలోని ఈ భాగం చాలా కాలంగా ప్రమాదాల కేంద్రంగా మారిందని, రహదారి విస్తరణ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement