రాష్ట్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మూడో సంతానం పుట్టినప్పుడు ఇకపై ఏడాది పాటు ప్రసూతి సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవుని 365 రోజులకు పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీంతో మొదటి ఇద్దరు పిల్లలకు అందుతున్న ప్రసూతి సెలవు ప్రయోజనం మూడో బిడ్డకు కూడా వర్తించనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖకు సంబంధించిన పద్దులపై చర్చ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి డి.శరత్‌కుమార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇద్దరి కంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు లభిస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగులకు గరిష్ఠంగా 12 వారాలు (84 రోజులు) మాత్రమే పూర్తి వేతనంతో సెలవు ఇచ్చేవారు. మూడో బిడ్డ విషయంలోనూ ప్రసూతి ప్రయోజనాలని నిరాకరించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో జనాభా మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రసూతి సెలవుల పెంపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆరోగ్య మంత్రి కేజీ అరుణ్‌రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4 కంటే దిగువకు పడిపోయిందని తెలిపారు. జనాభా పునరుత్పత్తికి అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది గణనీయంగా తక్కువని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 16 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని, ఈ జనాభా మార్పు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతోందని మంత్రి అన్నారు. మూడో బిడ్డని కనేందుకు దంపతులని ప్రోత్సహించే విధానాలని కూడా భవిష్యత్తులో పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు.


