‘సర్‌’పై ఢిల్లీలో మళ్లీ రగడ  | Protesters march to CEC Gyanesh Kumar resignation demand | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై ఢిల్లీలో మళ్లీ రగడ 

Oct 24 2026 6:38 AM | Updated on Oct 24 2026 6:38 AM

Protesters march to CEC Gyanesh Kumar resignation demand

ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నం  

‘సర్‌’ను ఉపసంహరించాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్‌  

వంద మందికిపైగా నిరసనకారుల అరెస్టు 

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను ఉపసంహరించుకోవాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. శుక్రవారం వేలాది మంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వీరిలో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, విద్యార్థి సంఘాల నేతలు, ప్రతినిధులు సైతం ఉన్నారు. 

అశోక రోడ్డులోని ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న నిరసనకారులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అయినప్పటికీ బంగ్లాసాహిబ్‌ గురుద్వారా వద్ద బారికేడ్లను ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నారు. 

అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. జాతీయ జెండాలు, బ్యానర్లను చేతబూని ‘సర్‌’కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓట్ల చోరీని అడ్డుకోవాలని, ‘సర్‌’తో ఎన్నికలు నిర్వహించవద్దంటూ తేల్చిచెప్పారు. కొందరు యువకులు చెట్టుపైకి ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అతికష్టంమీద అడ్డుకున్నారు. దాదాపు వంద మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత జెండాను ఊపుతున్న విద్యార్థులను బస్సుల్లోకి బలవంతంగా ఎక్కిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

 సీపీఎం సీనియర్‌ నేత బృందా కరత్, ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్, ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్, క్రాంతికారి యువ సంఘటన్, స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర సంఘాల కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసులు తమను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు అక్కడే బైఠాయించారు. ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’నిర్వహించారు. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలోని సెక్షన్‌ 163 కింద ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ జవాన్ల భారీగా మోహరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement