సొంత సైనికుల మృతదేహాలనే తిరస్కరించారు
ఇస్లాం సంప్రదాయాలతో ఖననం చేసింది మేము
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై భారత్ ధ్వజం
యునైటెడ్ నేషన్స్: కార్గిల్ యుద్ధంలో మరణించిన సొంత సైనికుల మృతదేహాలను సైతం తిరస్కరించిన దేశం... విశ్వాసం, మతస్వేచ్ఛ, అంతిమ సంస్కారాల గురించి మాట్లాడటం విడ్డూంగా ఉందని భారతదేశం ఐక్యరాజ్య సమితి వేదికగా పొరుగుదేశం పాకిస్థాన్‌పై ధ్వజమెత్తింది. ‘‘జమ్మూ కశ్మీర్‌లో భద్రతా చర్యల్లో మరణించిన వ్యక్తుల అంత్యక్రియలను సైతం అడ్డుకున్నట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళనకరం.
మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడాన్నీ నిరాకరించడం, దూరప్రాంతాల్లో రహస్యంగా ఖననం చేయడం వంటి చర్యలు ముస్లింలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ చర్యలన్నీ వారి సంప్రదాయాలకు విరుద్ధం’’అని ‘ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ అండ్ బిలీఫ్’అంశంపై నజిలా ఘానియా సిద్ధం చేసిన మధ్యంతర నివేదికలో ఉండటంపై భారత్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి భావిక మంగళానందన్ మాట్లాడుతూ ‘‘సొంత సైనికుల మృతదేహాలను గుర్తించేందుకు నిరాకరించిన దేశం మత విశ్వాసాలు, అంత్యక్రియల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది’’అని 1999నాటి కార్గిల్ యుద్ధ సందర్భాన్ని ప్రస్తావించారు. యుద్ధంలో మరణించిన పాకిస్థాన్ సైనికులకు భారత్ మిలటరీ గౌరవంతో, ముస్లిం సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో పాకిస్థాన్ తాము, తమ సైనికులు యుద్ధంలో పాల్గొనలేదని బుకాయించారని స్పష్టం చేశారు. ‘‘భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌పై వ్యామోహాన్ని వదిలి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని రావల్‌కోట్ వంటిచోట్ల తాజా పరిస్థితి, పరిణామాలపై దృష్టి పెడితే మంచిది’’అని స్పష్టం చేశారు.


