న్యూఢిల్లీ: ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కీలకమైన మైలురాయి ప్రజల సంక్షేమం పట్ల మోదీకి ఉన్న అచంచలమైన నిబద్ధతను, భారత్ పురోగతిని ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మనం చూసిన పరివర్తన ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్ఘాటించారు.
‘‘గృహవసతి, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, ఇంధనం, ప్రాథమిక సౌకర్యాల లభ్యతను విస్తరించడం నుంచి కనెక్టివిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అవకాశాలను బలోపేతం చేయడం వరకు.. అనేక పరివర్తనాత్మక కార్యక్రమాలు దేశం నలుమూలలా లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేశాయి. ప్రధాని మోదీ కృషితో ఎన్నో విజయాలు సాధ్యమయ్యాయి.
ఆత్మవిశ్వాసంతో, నూతన ఆశయాలతో ముందుకు సాగుతున్న భారత్ వైపు ప్రపంచం నూతన గౌరవం, విశ్వాసంతో చూస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో మోదీ మార్గదర్శకత్వం, సంకల్పం నుండి భారత ప్రజలు ప్రయోజనం పొందుతూనే ఉండాలి. ప్రజాసేవలో అంకితభావంతో ముందడుగు వేస్తున్న మోదీకి రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం, ఆనందం, నిరంతర శక్తి లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాష్ట్రపతి వెల్లడించారు.
మోదీకి ఎల్‌కే అద్వానీ ఆశీస్సులు
ప్రధాని మోదీ బుధవారం మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్వానీ నుంచి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్వానీని కలిసి ఆశీస్సులు తీసుకున్నాను. దశాబ్దాల తరబడి వారు అందించిన సేవలు, చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోయే ముద్రను వేశాయి. భారతదేశ పురోగతిని బలోపేతం చేయడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు’’ అని మోదీ కొనియాడారు.
ప్రముఖులకు మోదీ కృతజ్ఞతలు
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అదే కర్తవ్య స్ఫూర్తితో, అంకితభావంతో పని చేస్తూనే ఉంటానని ప్రధాని మోదీ వివరించారు. వికసిత్ భారత్ అనే సామూహిక దార్శనికతను సాకారం చేయడానికి మరింత శక్తితో పనిచేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రజల ఆప్యాయత, విశ్వాసం, ఆశీస్సులతో ప్రతి దశలోనూ రూపుదిద్దుకున్న ఈ 25 ఏళ్ల సేవా ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చిందని ఉద్ఘాటించారు. పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు అభినందనలు తెలియజేసిన ప్రముఖులకు మోదీ బుధవారం ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం, భాగస్వామ్యంతో తన సేవా యాత్ర అడుగడుగునా బలోపేతమైందని పేర్కొన్నారు. ప్రముఖులతోపాటు ప్రజల అభినందనలు తనకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయని వెల్లడించారు.


