కురుక్షేత్ర: హర్యానా రాష్ట్ర అవతరణకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం కురుక్షేత్రకు చేరుకున్నారు. అంబాలా నుంచి రోడ్డు మార్గంలో చేరుకున్న ఆమె తొలుత భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కురుక్షేత్రలోని శ్రీమద్భగవద్గీత సభాగారంలో జరిగే రాష్ట్రస్థాయి వజ్రోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం గురుకుల కురుక్షేత్రలో నిర్వహించే కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ఈ సందర్భంగా హర్యానా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక జ్ఞాపికను రాష్ట్రపతికి అందించనున్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కురుక్షేత్రలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 పోలీసు కంపెనీలతో పాటు తొమ్మిది మంది ఐపీఎస్‌లు, 30 మంది డీఎస్పీలు, పలువురు ఇన్‌స్పెక్టర్లను విధుల్లో నియమించారు. జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కార్యక్రమ ప్రాంగణాల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సిబ్బంది, మీడియా ప్రతినిధుల బ్యాగులను ఎక్స్‌రే స్కానర్లతో పరిశీలిస్తున్నారు. డ్రోన్‌ల వినియోగంపైనా ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి: ఢిల్లీ మార్చ్‌కు ప్రకాశ్ రాజ్.. విమానం నుంచి వీడియో సందేశం!
రాష్ట్రపతి పర్యటన కారణంగా కురుక్షేత్ర పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పంజాబ్, పిహోవా, కైతల్, యమునానగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


