ఆలయ మర్యాదలతో అర్చకులు, వేద పండితులు స్వాగతం
ఆశీర్వచనంలోని ఓ శ్లోకం గురించి అడిగి మరీ అర్ధం తెలుసుకున్న రాష్ట్రపతి
జైల్‌సింగ్, శంకర్‌దయాళ్ శర్మ తర్వాత ఇక్కడికి వచ్చింది మీరేనన్న అర్చకులు
ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్న ముర్ము
సాక్షిప్రతినిధి, విజయవాడ / విమానాశ్రయ (గన్నవరం): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు. శ్రీ మహా చండీదేవి అలంకృత కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి హోదాలో దుర్గగుడికి విచ్చేసిన ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు సంప్రదాయ ఆలయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతరాలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె సుమారు అక్కడ ఎనిమిది నిమిషాలపాటు ఉన్నారు. దర్శనానంతరం వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆమె అక్కడి పూజారులను గుడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశీర్వచనం సందర్భంగా చదివిన ఒక శ్లోకాన్ని మళ్లీ చదివించుకుని దాని అర్థం అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడికి ఇంతకుముందు వేరే రాష్ట్రపతులు ఎవరైనా వచ్చారా అని వాకబు చేయగా.. జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్‌దయాళ్ శర్మ వచ్చారని.. ఆ తర్వాత వచ్చింది మీరేనని అర్చకులు బదులిచ్చారు. ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రపతికి దేవస్థానం ఈఓ వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, మంత్రి అనిత శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడ బసచేశారు.
గన్నవరంలో ఘనస్వాగతం..
అంతకుముందు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోజుల విజయవాడ పర్యటన నిమిత్తం ఆమె న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సా.6.10 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు, పలు శాఖల అధికారులు స్వాగతం పలికారు.
నేడు జాతీయ సారస్ మేళాను ప్రారంభించనున్న రాష్ట్రపతి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): కృష్ణానదీ తీరాన పున్నమిఘాట్లో నిర్వహించనున్న జాతీయ సారస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉ.7 గంటలకు ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కేశినేని శివనా«థ్ బుధవారం మేళా ఏర్పాట్లను పరిశీలించారు.


