
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ‘పోల్ బాడీ’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల సమయమే ఉన్న ప్రస్తుత తరుణంలో అధికార ప్రభుత్వం ఓటర్ల జాబితాను తీర్చిదిద్దడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో ఎన్నికల సంఘానికి చెందిన పోల్ బాడీ ప్రతిపక్షాల విమర్శలకు తలొగ్గింది.
రాష్ట్రంలో ఓటరు నమోదుకు తప్పనిసరిగా పేర్కొన్న పత్రాలను సమర్పించకపోయినా, స్థానిక దర్యాప్తు ఆధారంగా కూడా వారి ధృవీకరణపై నిర్ణయం తీసుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న ఓటరు జాబితాలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ప్రతిపక్షం గగ్గోలు పెట్టిన తరుణంలో ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పత్రాలను సమర్పించకుండానే బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఓటర్లు ఓటర్ల జాబితాలో ధృవీకరణ పొందవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. పత్రాలు లేనిపక్షంలో స్థానిక స్థాయిలో దర్యాప్తు ఆధారంగా ఎలక్టోరల్ రిజిస్ట్రార్ అధికారి ధృవీకరణ చేయనున్నారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ ప్రక్రియ బీజేపీ గెలిచేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించాయి. అయితే దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఒక సూచన చేస్తూ.. అవసరమైన పత్రాలు, ఫోటో అందుబాటులో లేకపోతే, గణన ఫారమ్‌ను పూరించి బూత్ స్థాయి అధికారికి అందించాలని పేర్కొంది. వారు ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారితో మాట్లాడి, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇతర పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీహార్‌లో ఇప్పటివరకు 1.21 కోట్ల మంది ఓటర్లు గణన ఫారాలను నింపి సమర్పించారు. జూలై 25 నాటికి ఈ ఫారమ్‌లను సమర్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో భాగం అవుతారని పోల్ బాడీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే..