
సాక్షి బెంగళూరు: కల్నల్ సోఫియా ఖురేషీ అత్తవారింటిపై ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు దాడి చేశాయని ‘ఎక్స్’లో వదంతులు వ్యాపించాయి. కర్ణాటకలోని బెళగావిలో సోఫియా భర్త ఇంటిపై దాడి జరిగినట్లుగా వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ బీమా శంకర్ స్పష్టంచేశారు.
సోఫియా భర్త ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారులు దాడి చేసినట్లుగా ధ్వంసమైన ఒక ఇంటిని ఫోటోను అనీస్ ఉద్దీన్ అనే పేరుతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. అది ఫేక్ పోస్టు అని పోలీసులు తేల్చారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.