సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లాలో యాక్సిడెంటు పోలీసు శాఖకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువ ఎస్‌ఐలు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బెంగళూరు సాయుధ పోలీసు (సీఏఆర్) విభాగంలో ఎస్‌ఐలు పనిచేసే మంజునాథ్ దారిమని (31), అమరేష్ (25), సచిన్ (30), ఎల్.ఈశ్వర్ (28), మహదేశ్వర బొమ్మన్నవర్ (26) స్నేహితులు. కొంతకాలం కిందటే ఉద్యోగాలలో చేరి బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నారు.
ముగ్గురు అక్కడికక్కడే
తమ బ్యాచ్‌మేట్ పెళ్లి బళ్లారిలో జరుగుతోంది. దీంతో మారుతి సియాజ్ కారులో బెంగళూరు నుంచి 5 మంది బయల్దేరారు. వారిలో ఒకరు కారు నడుపుతున్నారు. ఉదయం 10:30 సమయంలో ఘటనాస్థలి వద్దకు వచ్చేటప్పటికి అతివేగంగా కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొని దానిలోకి చొచ్చుకుపోయింది. కారులోని వారిలో మంజునాథ్, అమరీష్, సచిన్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈశ్వర్, మహదేశ్వర తీవ్ర గాయాల పాలయ్యారు. కారు ముందు భాగం మొత్తం నుజ్జయింది. ఇతర వాహనదారులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును బయటకు తీసి మృతదేహాలను చెళ్లకెరె ప్రభుత్వాస్పత్రికి, గాయపడినవారిని దావణగెరె ఆస్పత్రికి తరలించారు. మృతులందరూ అవివాహితులే అని పోలీసు అధికారులు పేర్కొన్నారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తల్లిదండ్రుల రోదనలు
తమ కుమారులు మరణించారని తెలియగాని తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన చెళ్లకెరెకు చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్ బండారు, అడిషనల్ ఎస్పీ శివకుమార్, పోలీసులు వచ్చారు. చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గది వద్ద మృతులు తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అందరూ స్నేహితులు. కష్టపడి చదువుకుని, ఎస్‌ఐ పరీక్షల్లో పాసై ఉద్యోగం చేస్తున్నారు. సహచర ఎస్‌ఐ పెళ్లి జరుగుతుంటే కారులో ఉత్సాహంగా బయల్దేరారు. కానీ విధి కర్కశంగా కాటేసింది, లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు దర్మరణం చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర విషాదం చిత్రదుర్గం జిల్లా చెళ్లెకెరె తాలూకాలో హెగ్గెరె గ్రామం వద్ద బెంగళూరు– హైవేలో సంభవించింది. ఉజ్వలమైన జీవితం రక్తసిక్తమైంది.
చిత్రదుర్గం జిల్లాలో ముందు
వెళ్తున్న లారీని కారు ఢీ
నుజ్జునుజ్జయిన కారు
ముగ్గురు రిజర్వు ఎస్‌ఐలు మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
బెంగళూరు నుంచి
బళ్లారికి వస్తుండగా ఘోరం


