రథంలో గోపాలుని విహారం | - | Sakshi
Sakshi News home page

రథంలో గోపాలుని విహారం

Mar 16 2026 7:39 AM | Updated on Mar 16 2026 7:39 AM

మైసూరు: రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలోని శ్రీ హిమవద్‌ గోపాలస్వామి పర్వతంపై ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో గోపాలస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా జరిగింది. స్వామి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించిన తేరులో ఉంచి పూజలు చేశారు. ఏటా మాదిరిగానే, వేలాది మంది భక్తులు అడవి నుంచి తీసుకువచ్చిన హంబిని రథాన్ని జై గోపాలస్వామి అంటూ నినాదాలు చేస్తూ లాగారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.

ఎండల మాటున చల్లని వర్షం

పలు జిల్లాల్లో జల్లువానలు

బనశంకరి: రాష్ట్రంలో ఎండల మధ్య వర్షాలు చల్లగా ఉపశమనం కలిగించాయి. ఆదివారం కొడగు, చిక్కమగళూరు, బెళగావి జిల్లాలో వర్షం కురిసింది. బెళగావిలో అర్ధ గంటకు పైగా వర్షం కురిసింది. కొడగులో వర్షాలకు కాఫీ తోటల రైతులు హర్షం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు జిల్లాలో పలుచోట్ల గాలీవానతో పాటు వడగండ్లు పడ్డాయి. చిక్కమగళూరు తాలూకా కణతి గ్రామం వద్ద వర్షానికి చెట్టు విరిగిపోవడంతో శృంగేరి రాష్ట్ర రహదారిలో వందలాది వాహనాలు చిక్కుకుపోయాయి. రాష్ట్రంలో బళ్లారి, ఉడుపి, దక్షిణకన్నడ, కొడగు, మైసూరు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముంది. ఇక యాదగిరి, రాయచూరు, కలబురిగితో పాటు చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలను దాటింది.

కబ్జాల తొలగింపు పేరుతో వక్క తోట నేలమట్టం

శివమొగ్గ: శివమొగ్గ తాలూకాలోని మండెనకొప్పలో రెవెన్యూ శాఖ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టి వక్క తోటను నేలమట్టం చేశారు. పంట ఇస్తున్న చెట్లను ఆకస్మాత్తుగా కూల్చివేస్తారా? అని తోటల పెంపకందారులు ఆగ్రహించారు. మంత్రి మధు బంగారప్ప ఆదేశాలతో మండెన కొప్పలోని సర్వే నంబర్‌ 241–1లో చెరువును ఆక్రమించి తోటలు వేశారని అధికారులు జేసీబీలతో తొలగింపు చేపట్టారు. ఆ తోట యజమాని రుద్రేష్‌ 2000లో వక్క మొక్కలు నాటి సాగు చేస్తున్నాడు. ఇది వివాదం కావడంతో అధికారులు సర్వే నిర్వహించారు. 300కు పైగా వక్క చెట్లను జేసీబీతో పెకలించి తోటను రూపుమాపారు. బలమైన రాజకీయ నాయకుల వల్లనే రైతు రుద్రేష్‌కు అన్యాయం చేశారని స్థానిక రైతు నేతలు ఆరోపించారు.

వివాహిత

అనుమానాస్పద మృతి

యశవంతపుర: వివాహిత యువతి అనుమానాస్పదంగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయిన ఘటన యలహంకలో జరిగింది. శృతి (22) మృతురాలు కాగా, భర్త పవన్‌ కళ్యాణ్‌పై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అదనపు కట్నం గురించి భర్త వేధిస్తుండడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గతంలో రాజీ ప్రయత్నాలు జరిగాయి. అయితే అత్తింటిలో వేధింపులు తట్టుకోలేక శృతి చనిపోయిందని చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఆమెను హత్య చేసి ఆమె ఉరి నాటకం ఆడుతున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. యలహంక న్యూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement