శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సవతి తల్లి ప్రేమను చూపుతోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి దేశంలో సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అదే ప్రకారంగా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యపై అసెంబ్లీలో కూడా చర్చించామని, తాము సమాధానం చెప్పామన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లు కర్ణాటకలోనే సిలిండర్ల సమస్య ఎందుకుందని బీజేపీ నాయకులు బీ.వై.విజయేంద్ర, ఆర్.అశోక్ ప్రశ్నించడంపై మండిపడ్డారు. కేంద్రం సవతి తల్లి ధోరణి వల్లేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సక్రమంగా సిలిండర్లను సరఫరా చేయాలన్నారు. ఇతర దేశాల నుంచి సహజవాయువును దిగుమతి చేసుకోవాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్ల రంగానికి సమస్య అయ్యింది, ఈ రంగంలో వేల మంది పనిచేస్తున్నారు, వారి గతేమిటని అన్నారు.
ఆగని కష్టాలు
యశవంతపుర: బెంగళూరులో గ్యాస్ సిలిండర్ల కొరత ఉండగా, కొందరు ఎక్కువ రేట్లకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన గోదాములపై పోలీసులు దాడులు చేశారు. పీణ్యా, ఆర్‌ఎంసి యార్డ్, కెంగేరి, చిక్కజాల పరిధిలో జరిగాయి. సిలిండర్లను సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. గ్యాస్ లేక బెంగళూరులో అనేక హోటళ్లు ఆదివారం కూడా మూతపడ్డాయి. కొన్ని హోటల్స్‌లో మెను ను పూర్తిగా మార్చివేశారు. ఎక్కువ గ్యాస్ ఖర్చయ్యే వంటలను తీసేశారు. ప్రజలు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు.
కేంద్రంపై సీఎం సిద్దరామయ్య గుర్రు
పరిష్కారానికి చర్చిస్తున్నాం
శివాజీనగర: బెంగళూరులో వాణిజ్య సిలిండర్లు, వాహనాలకు ఎల్‌పీజీ కొరత కొనసాగుతుండగా, కొంతమేరకు హోటళ్లకు గ్యాస్ ఇవ్వడంపై చర్చిస్తున్నామని ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి కే.హెచ్.మునియప్ప తెలిపారు. సోమవారం సాయంత్రం గ్యాస్ కంపెనీల అధికారులతో భేటీ ఉంది, సమస్య పరిష్కారం ఆలస్యమవుతోంది, ఇప్పటి వరకు యుద్ధం ఆగలేదు. ప్రజలు గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలి, బెంగళూరులో అనేక హోటల్‌లు మూతబడ్డాయి. మరికొన్ని హోటల్‌లు వంటకాలను మార్చాయి. ఇండక్షన్, కట్టెలపొయ్యిను ఉపయోగిస్తున్నారు అని మంత్రి తెలిపారు. హోటళ్లకు గ్యాస్ కొరత వారంలోగా తీరిపోతుందనుకుంటే మరింత అధికమైందన్నారు.


