
సాగు, మత్స్య, పాడి పరిశ్రమలను కాపాడుకుంటాం
అవసరమైతే భారీ మూల్యం చెల్లించడానికైనా సిద్ధం
తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను పరోక్షంగా తిప్పికొట్టిన ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా తిప్పికొట్టారు. తమ రైతన్నల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మత్స్య, పాడి పరిశ్రమలను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. దేశీయంగా వ్యవసాయ, పాడి రంగాలకు నష్టం చేకూర్చే నిర్ణయాలేవీ తీసుకోవడం లేదని స్పష్టంచేశారు.
ఇతర దేశాల ఒత్తిళ్లకు తలొగ్గబోమని, తమపై టారిఫ్ బెదిరింపులు పనిచేయబోవని పరోక్షంగా వెల్లడించారు. అవసరమైతే వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు.
అన్నదాతలతోపాటు మత్స్యకారులు, పాడి రైతులు, కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వారికి మేలు చేసే విషయంలో వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తనకు తెలుసని, అందుకు సిద్ధంగానే ఉన్నానని వివరించారు. మన వాళ్ల బాగుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ స్మారక నాణెం, తపాలా బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
పౌష్టికాహార భద్రత సాధించాలి
‘‘దేశంలో వ్యవసాయ రంగ పురోభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పౌష్టికాహార భద్రత సాధించడం అత్యవవసరం. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేయాలి. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచాలి. కరువులు, అధిక ఉష్ణోగ్రతలు, వరదలను తట్టుకొని అధిక ఉత్పాదకత ఇచ్చే వంగడాలను కృత్రిమ మేధ(ఏఐ), మెíషీన్ లెర్నింగ్‌తో రూపొందించాలి.
పంటల ఉత్పత్తిని ముందుగానే అంచనా వేయడానికి, తెగుళ్లను గుర్తించడానికి, రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి రియల్–టైమ్ వ్యవస్థలను ప్రతి జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలి. పంటల మారి్పడిపై పరిశోధనలు మరింత ఊపందుకోవాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు సాగు చేయాలో గుర్తించాలి. మట్టి పరీక్షల కోసం చౌక ధరల్లో దొరికే పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని మోదీ అన్నారు.
పథకాలతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం
‘‘దేశ ప్రగతికి పునాది రైతుల ప్రగతే. రైతన్నల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం–కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం కృషి సించాయ్ యోజన, పీఎం కిసాన్ సంపద యోజన, పీఎం ధన్ ధాన్య యోజన వంటివాటిని వ్యవసాయం, అనుబంధాల రంగాల సమగ్రాభివృద్ధి కోసమే తీసుకొచ్చాం. 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేశాం.
ఆయా పథకాలతో కేవలం ఆర్థిక తోడ్పాటే కాకుండా, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. పంటల ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. వారి కోసం నూతన ఆదాయ మార్గాలు సృష్టిస్తున్నాం. సహకార సంఘాలకు, స్వయం సహాయక గ్రూప్‌లకు ఆర్థిక మద్దతు లభిస్తోంది. దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది.
పంటల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు అదే సమయంలో పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎం.ఎస్. స్వామినాథన్ పదేపదే సూచించారు. ఆయన నిర్దేశించిన బాటలో మనం నడవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సౌమ్య స్వామినాథన్ పాల్గొన్నారు.
మోదీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో చేనేత రంగం ప్రగతి పథంలో సాగుతోందని పేర్కొన్నారు. 2,600 ఎగ్జిబిషన్ల ద్వారా 43 లక్షల మంది చేనేత కారి్మకులు, అనుబంధ కార్మికులకు నేరుగా మార్కెట్ సౌలభ్యం లభించిందని, రూ.1,700 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. 20కిపైగా దేశాలకు మన చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని, వాటి విలువ రూ.21,000 కోట్లకు చేరిందని హర్షం వ్యక్తంచేశారు. మన సంప్రదాయ చేనేత కళ, వైభవం అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు.