
నాగపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీన మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. అలాగే మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
హెడ్గేవర్‌తోపాటు ఆర్‌ఎస్‌ఎస్ రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ స్మారకాలను నాగపూర్‌లో రేషిమ్‌బాగ్ ప్రాంతంలోని డాక్టర్ హెడ్గేవర్ స్మృతి మందిర్‌లో నిర్మించారు. ఇరువురు నేతల స్మారకాలను ప్రధాని మోదీ సందర్శించి, నివాళులరి్పస్తారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే గురువారం వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1956లో వేలాది మంది దళితులతో కలిసి బౌద్ధ దీక్ష స్వీకరించిన పవిత్ర స్థలమైన దీక్షాభూమిని, సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్‌ను కూడా మోదీ సందర్శిస్తారని తెలిపారు.
6న పంబన్ వంతెన జాతికి అంకితం
శ్రీరామనవమి సందర్భంగా మోదీ ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ స్వామి మందిరాన్ని దర్శించుకోనున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన పంబన్ రైల్వే వంతెనను లాంఛనంగా ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి కావడం విశేషం. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం దీవితో అనుసంధానిస్తుంది. గతంలో ఇక్కడున్న పాత వంతెనపై రైలు ప్రయాణానికి 30 నిమిషాల సమయం పట్టేది. కొత్త వంతెనతో కేవలం 5 నిమిషాల్లోనే రామేశ్వరం దీవికి చేరుకోవచ్చు.