రంగంలోకి సీఈసీ..
సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించేందుకు ముందుగా ఇక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్(సీఈసీ) వర్గాలు చైన్నెలో పర్యటించనున్నారని సమాచారాలు గురువారం వెలువడ్డాయి. రాష్ట్రంలో మే మొదటివారంలో కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, ఏప్రిల్‌లో ఎన్నికలు ఒకే విడతగా ముగించే దిశగా ఎన్నికల యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది. కొత్త ప్రభుత్వం కొలువుకు మరో రెండు నెలలే సమయం ఉండంతో ముందుగా అన్ని ప్రక్రియలను ముగించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉరకలు తీస్తున్నారు. నగారా మార్చి 5న మోగ వచ్చన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కమార్ నేతృత్వంలోని అధికారుల బృందం చైన్నెకు రానున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈనెల 12,13 తేదీలలో చైన్నెలో ఈ బృందం సమావేశాలలో బిజీ కానున్నది. తొలుత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఆ తదుపరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన బృందం, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశానికి నిర్ణయించింది. అంతలోపు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినఅంశాలతో సమగ్ర నివేదిక రూపకల్పనలో ఆయా జిల్లాల అధికారులు,రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ కసతర్తులు వేగవంతం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను విజయవంతంగా ముగించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లుగల్లంతైన వాళ్లు సుమారు 34 లక్షల మంది మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన తాజాగా జరుగుతోంది. ఈనెల 17న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో అసెంబ్లీ నియోజవవర్గాల వారీగా భద్రపరిచిన ఈవీఎంలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో తనిఖీలు చేసి ఉన్నారు. ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలో 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం 68,400 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తూ, చర్యలు తీసుకున్నారు. 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.


