Mann Ki Baat: జన స్పందనకు వందనం | PM Narendra Modi spoke about in his Mann Ki Baat address | Sakshi
Sakshi News home page

Mann Ki Baat: జన స్పందనకు వందనం

Jul 1 2024 5:04 AM | Updated on Jul 1 2024 5:04 AM

PM Narendra Modi spoke about in his Mann Ki Baat address

సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ఓటేశారు 

రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు  

మన్‌ కీ బాత్‌లో ప్రధాని  

పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్తున్న మన ఆటగాళ్లను ప్రోత్సహించాలని ప్రజలకు సూచన   

తల్లి పేరిట మొక్కలు నాటాలని పిలుపు  

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. 

వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. 

మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్‌ మీడియాలో ‘ఛీర్‌4భారత్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్‌కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్‌ కీ బాత్‌లో మోదీ ఇంకా ఏమన్నారంటే..

నా తల్లి పేరిట మొక్క నాటాను  
‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.  

సంస్కృత భాషను గౌరవించుకుందాం   
ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్‌కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. 

బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్‌ 30) ‘హూల్‌ దివస్‌’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్‌ గిరిజన యోధులు వీర్‌ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్‌ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్‌ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా.  

మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ  
భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్‌ కల్చర్‌పై కువైట్‌ ప్రభుత్వం కువైట్‌ నేషనల్‌ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  తుర్కమెనిస్తాన్‌లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ  అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు.

 అందులో గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్‌తోపాటు భారత్‌కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్‌ దేశాలైన సురినామ్, సెయింట్‌ విన్సెంట్, గ్రెనాడైన్స్‌లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్‌ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.

వోకల్‌ ఫర్‌ లోకల్‌  
మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది.

 ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్‌ ఉత్పత్తులను గ్లోబల్‌కు చేర్చడంలో జమ్మూకశ్మీర్‌ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్‌కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్‌ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్‌ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది.  

ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు
‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్‌ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్‌ పవన్‌ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్‌– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్‌–యూజీ పేపర్‌ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్‌ ఖేరా హితవు
పలికారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement