నితీశ్‌ సిగ్గుపడాలి: ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi slams Nitish over population control remarks - Sakshi

అసెంబ్లీలో నితీశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం

మహిళ పట్ల గౌరవం లేని నాయకుల వల్ల ఉపయోగం ఏమిటని ధ్వజం 

మహిళల గౌరవాన్ని కాపాడుతానని హామీ 

మధ్యప్రదేశ్‌లో మోదీ ఎన్నికల ప్రచారం  

దమోహ్‌/గుణ: బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సాక్షాత్తూ అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. మహిళలను దారుణంగా అగౌరవపర్చినా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు నోరు విప్పడం లేదని, కనీసం ఖండించడం లేదని తప్పుపట్టారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల పట్ల నితీశ్‌ సిగ్గుపడాలని అన్నారు. తల్లులు, అక్కచెల్లెమ్మల పట్ల ఏమాత్రం గౌరవం లేని నాయకులతో ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు.

మహిళలను చిన్నచూపు చూసే వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు  మోదీ సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడానికి తాను చేయాల్సిందంతా చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని దమోహ్, గుణ పట్టణాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తనకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఏ కోర్టుకు వెళ్లినా సరే ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

ప్రతి ఇంట్లోనూ సౌర విద్యుత్‌ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇంట్లో వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటును ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడూ విద్యుత్‌ ఉత్పత్తిదారుడే అవుతారని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం రావడంతో అభివృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.80 వేల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు.  
‘ఉచిత రేషన్‌’ పొడిగింపుపై

కాంగ్రెస్‌ అక్కసు  
పేదల ప్రజలకు ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తామంటూ తాను హామీ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జీరి్ణంచుకోలేకపోతున్నారని, అందుకే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారిని ఆ పాపం చేయనిద్దామని అన్నారు. తాను మాత్రం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూనే ఉంటానని చెప్పారు. 80 కోట్ల మందికి వచ్చే ఏదేళ్లపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇవ్వబోతున్నామని తెలిపారు.

తనను చాలామంది ఇష్టానుసారంగా దూషిస్తున్నారని, అయిప్పటికీ అవినీతిపై పోరాటం ఆపబోనని తేల్చిచెప్పారు. ఎవరెంత తిట్టుకున్నా తాను లెక్కచేయనని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఆ పార్టీ ముఖ్యమంత్రులు బెట్టింగ్‌ల్లో భాగస్వాములవుతున్నారని, నల్లధనం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం తాము 2014లో అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి చేరుకుందని, 200 ఏళ్లపాటు మన దేశాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టేశామని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచమంతా సంభ్రమాశ్చర్యాలతో మనవైపు చూస్తోందని అన్నారు. తాను మూడోసారి ప్రధానమంత్రి కావడం తథ్యమని, భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘85 శాతం కమిషన్‌ వ్యవస్థ’ మళ్లీ అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top