
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని రీతిలో అసాధారణ అభివృద్ధి జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. గతంలో బాంబులు, తుపాకులు, ఘర్షణలకు మారుపేరైన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ఈశాన్యంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వైవిధ్యమే ఈశాన్యానికి అతిపెద్ద బలమని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు, వ్యాపారాభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఇంధనం, సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులకు ఈశాన్య రాష్ట్రాలు గమ్యస్థానంగా మారాయని వెల్లడించారు. దేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంలో అస్సాం పాత్ర గణనీయంగా పెరిగిందని ఉద్ఘాటించారు.
నార్త్‌ఈస్ట్ సెమీకండక్టర్ ప్లాంట్ నుంచి అతిత్వరలో మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ రాబోతోందని ప్రకటించారు. ఈశాన్యానికి ఇదొక మైలురాయి కాబోతోందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంపాటు హైటెక్ పారిశ్రామిక ప్రగతిలో ఈశాన్య రాష్ట్రాల స్థానం మరింత పటిష్టం కానుందని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదం, తీవ్రవాదంపై కఠిన వైఖరి ఏ ప్రాంతమైనా చక్కటి అభివృద్ధి సాధించాలంటే అక్కడ శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అశాంతి, హింస కారణంగా గతంలో ఈశాన్య ప్రాంత యువకులు ఎన్నో అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదం, తీవ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అభివృద్ధికి అడ్డుగా నిలిచే హింసాకాండను సహించే ప్రసక్తే లేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, గత 11 ఏళ్లలో ఈశాన్యంలో 10 వేల మంది యువకులు ఆయుధాలు వదిలేసి అభివృద్ధిలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. వారంతా హింసను వ్యతిరేకిస్తూ శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నారని ప్రశంసించారు.
టూరిజం హబ్‌గా నార్త్ ఈస్ట్
ఈశాన్య భారతదేశంలో హైడ్రోపవర్, సోలార్ పవర్ రంగాల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇప్పటికే రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఈశాన్యంలో సోలార్ మాడ్యూల్స్, సెల్ప్ తయారీ రంగంలోనూ ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని పెట్టుబడిదారులకు పిలుపు నిచ్చారు.
జీవ–ఆర్థిక వ్యవస్థ, వెదురు పరిశ్రమ, తేయాకు ఉత్పత్తి, పెట్రోలియం, క్రీడలు, నైపుణ్యాలకు ఈ ప్రాంతం పర్యాయపదంగా మారిందన్నారు. పర్యావరణ టూరిజానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. రైజింగ్ నార్త్ ఈస్ట్ పెట్టుబ డిదారుల సదస్సులో ఈశాన్య రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులతోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అని ల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది.