
ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన పుట్టినరోజు శుభాకాంక్షలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్‌ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి.
కంగ్రా జిల్లాలోని మెక్‌లియోడ్‌గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్‌ను కట్‌చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు.
‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది.
బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు.
శుభాకాంక్షలు తెలిపిన మోదీ
దలైలామాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం.
ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు.