బుల్లెట్ రైలు ఇంజనీర్లకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై పని చేస్తున్న ఇంజనీర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ పనిలో ఎదురవుతున్న అనుభవాలను నమోదు చేయాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో చేపట్టే ఇలాంటి ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇంజనీర్ల అనుభవాలు మున్ముందు ప్రాజెక్టుల ప్రణాళిక, అమలుకు ఎంతగానో తోడ్పడుతాయని చెప్పారు.
ప్రధాని మోదీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. సూరత్‌లో ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే(ఎంఏహెచ్‌ఎస్‌ఆర్) ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీర్లతో మాట్లాడారు. ‘బ్లూ బుక్’ తరహాలో అనుభవాలను రికార్డు చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు సాకారం కావాలంటే ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఇంజనీర్ల సహకారం అవసరమని ఉద్ఘాటించారు.


