అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..?

PM Modi As US Visit India Position On Russia Well Understood By World  - Sakshi

మోదీ అమెరికా పర్యటన వేళ.. రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై సర్వత్రా చర్చ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యాతో భారత్‌కు ఉన్న బంధంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ పెదవి విప్పారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. 'ఇండియాను తటస్థం అంటారు.. కానీ మా స్థితి అది కాదు.. మేము శాంతి పక్షాన నిలబడతామని' ప్రధాని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి సరిగాలేదనే వాదనలను ప్రధాని మోదీ కొట్టిపారేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ప్రతీ దేశం గౌరవించాలని సూచించారు. ప్రతీ దేశ సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ తగిన ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. 

అయితే.. ఇటీవలి కాలంలో అమెరికాతో భారత్ బంధం మరింత బలోపేతమైంది. 2022 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డ్ స్థాయిలో 191 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియాకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అమెరికా మూడో స్థానంలో ఉంది. అటు.. రష్యాతోనూ భారత్ మంచి సంబంధాలనే కొనసాగిస్తోంది. ఇండియా రక్షణ దిగుమతుల్లో 50 శాతం రష్యా నుంచి వస్తున్నాయి.  

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు బయల్దేరారు. మూడురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు. సతీసమేతంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక ఒప్పందాల బలోపేతం ప్రధానాంశంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ.

ఇదీ చదవండి: PM Modi US Visit: అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ.. బిజీ బిజీ షెడ్యూల్‌ ఇలా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top