ఢిల్లీ: పార్లమెంట్ సంవిధాన్ సదన్‌లో కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ పార్లమెంటరీ లీడర్స్ 28వ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలోపేతం అంశాలపై సదస్సులో చర్చించనున్నారు.
ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని.. భారత్ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటరీ వ్యవస్థ మరింత పారదర్శకంగా తయారవుతుందని ప్రధాని అన్నారు. భారత్ అభివృద్ధి గ్లోబల్ సౌత్, కామన్ వెల్త్ దేశాలకు ఉపయోగపడుతుందన్న మోదీ.. కరోనా సంక్షోభ సమయంలో భారత్ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసిందన్నారు.
ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కామన్వెల్త్ దేశాల స్వీకరులతో బిర్లా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. కామన్వెల్త్ దేశాల సమాఖ్యలోని 42 దేశాల నుంచి దాదాపు 61 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4 పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన పార్లమెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘‘ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ, బలోపేతంలో స్పీకర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్ల బాధ్యత ఎంత?. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్లమెంటరీ వ్యవహారాల్లో కృత్రిమ మేధను ఎలా వాడుకోవాలి?. పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది?. చట్టసభల పనితీరుపై సామాన్యుల్లో అవగాహన పెంచడం ఎలా?’’ అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.


