కాంగ్రెస్‌ ఉండగా మనీ హేస్ట్‌ ఎందుకు? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఉండగా మనీ హేస్ట్‌ ఎందుకు?

Published Wed, Dec 13 2023 9:33 AM

PM Modi criticized the corruption of the Congress party - Sakshi

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూకు చెందిన ప్రదేశాల్లో ఐటీ సోదాల్లో వందల కోట్ల నగదు బయటపడిందన్న కథనాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్‌’ను వేదికగా చేసుకున్నారు. బ్యాంకుల దోపిడీ కథతో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వెబ్‌ సిరీస్‌ ‘మనీ హేస్ట్‌’ను ఇటీవల బయటపడిన రూ.351 కోట్ల ఉదంతంతో పోలుస్తూ కాంగ్రెస్‌ను విమర్శించారు.

‘‘ దేశంలో కాంగ్రెస్‌ ఉండగా మళ్లీ మనీ హేస్ట్‌ అవసరమా ?. 70 ఏళ్లుగా కాంగ్రెస్‌ దోపిడీ(హేస్ట్‌) జరుగుతోంది. ఇంకా కొనసాగుతోంది కూడా’’ అని మోదీ ‘ఎక్స్‌’లో ట్వీట్‌చేశారు. ‘‘ కాంగ్రెస్‌ ప్రాయోజిత మనీ హేస్ట్‌ ’’ అంటూ మనీ హేస్ట్‌ వెబ్‌సిరీస్‌ టైటిల్‌ సాంగ్‌తో ఉన్న ఒక వీడియోను బీజేపీ తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌చేసింది.  కాంగ్రెస్‌ ఎంపీ ధీరీజ్‌ సాహూ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు కలసి దిగిన ఒక ఫొటోకు మనీ హేస్ట్‌ పాటను జతకలుపుతూ బీజేపీ విడుదలచేసిన ఆ వీడియోను మోదీ షేర్‌చేశారు.

మోదీతోపాటు బీజేపీ నేతలూ కాంగ్రెస్‌పై విమర్శల ధాటి పెంచారు. ఈ మేరకు బీజేపీ నేతలు కిరెణ్‌ రిజిజు, సంగీత సింగ్‌దేవ్, రామేశ్వర్‌ తేలి, నిశిత్‌ ప్రామాణిక్‌ మీడియాతో మాట్లాడారు.  ‘అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ మోదీ సర్కార్‌ చేస్తున్నయుద్ధం ధాటికి తట్టుకోలేకే విపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఒక్కతాటి మీదకొచ్చి నిల్చున్నాయి’’ అని కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు వ్యాఖ్యానించారు.

‘‘ రూ.351 కోట్లు బట్టబయలైన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ ప్రదేశం ఒక్కటే కాదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాంగ్రెస్‌ నేతలపైనే కాదు బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్తాన్, ఢిల్లీల్లోనూ విపక్ష పార్టీల నేతలపై చాలా అవినీతి కేసులున్నాయి. కాంగ్రెస్‌ నడుపుతున్న ఈ అవినీతి దుకాణాలన్నీ మూసేస్తాం. వీరిపై మోదీ సర్కార్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని అన్నారు. 

మీ మనీ హేస్ట్‌ సంగతేంటి: కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ దోపిడీ అంటూ మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ వెంటనే స్పందించింది. పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని ఉద్దేశిస్తూ.. ‘ ఆఫ్‌షోర్‌ ఫండ్ల ద్వారా భారీ లబ్ది పొందిన తైవాన్‌ వ్యాపారి చాంగ్‌ చుంగ్‌ లింగ్‌తో గౌతమ్‌ అదానీకి ఉన్న సంబంధాలేంటి? ఆస్తిపాస్తులులేని గౌతమ్‌ అదానీ ఒక్కసారిగా ప్రపంచ కుబేరుడెలా అయ్యాడు? అదానీ గ్రూప్‌ అసాధారణ సంపద వృద్దికి సాయపడిందెవరు?. మోదీజీ.. 1947 నుంచి దేశం ఎన్నడూ చూడని అతిపెద్ద మనీ హేస్ట్‌ గురించి మీరు వివరణ ఇవ్వాలని యావద్దేశం ఎదురుచూస్తోంది’’ అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

పటిష్ట ఏఐ నిబంధనలు
ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో వినియోగంలోకి వచ్చిన కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ఏఐ ఉగ్రవాదుల చేతిలో పడకుండా అంతర్జాతీయంగా పటిష్ట నిబంధనలు అవసరమని నొక్కిచెప్పారు. ఢిల్లీలో ‘గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఆన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(జీపీఏఐ) ’ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ‘‘డీప్‌ఫేక్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా చోరీలు పెచ్చరిల్లుతున్నందున ఏఐ పరిజ్ఞానం ఉగ్రవాదుల చేతికి చిక్కితే అత్యంత ప్రమాదకం. ఏఐతో పనిచేసే ఆయుధాలు ఉగ్రసంస్థల చేతికొస్తే ప్రపంచ భద్రతకే ప్రమాదం.

దీన్ని అడ్డుకోవాలంటే ఏఐ సాంకేతికత నైతిక వినియోగంపై అంతర్జాతీయ ఉమ్మడి ప్రణాళిక అవసరం. దేశాలన్నీ సమష్టిగా పటిష్ట నిబంధనావళిని రూపొందించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందాలున్నట్లే ఈ నూతన సాంకేతికత నైతిక వినియోగం విషయంలోనూ ప్రపంచస్థాయి మార్గదర్శకాలు, నిబంధనలు ఉండాలి.

నిబంధనల చట్రాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలి. ఏఐ పరిజ్ఞానాన్ని సంతరించుకున్న పరికరాలు, ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, పరీక్ష, తయారీలపై ప్రోటోకాల్‌ను అమల్లోకి తేవాలి. ఈ అంశంలో భారత్‌ తనవంతు బాధ్యత నెరవేర్చేందుకు సదా సిద్ధంగా ఉంది’’ అని మోదీ ప్రకటించారు.

Advertisement
 
Advertisement