
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన ఢిల్లీ నుంచి ఘనాకు విమానంలో బయలుదేరారు. నేటి నుంచి జూలై 9 వరకు ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన నేడు, రేపు ఘనాను సందర్శించనున్నారు.
మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఘానా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆర్ధిక, ఎనర్జీ, డిఫెన్స్ పరస్పర సహకారంపై చర్చ జరగనుంది. జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్, టోబాగోలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ట్రినిడాడ్ అధ్యక్షురాలు, ప్రధాని బిసెసర్‌తో భేటీ కానున్నారు. అలాగే ట్రినిడాడ్ పార్లమెంటులో సంయుక్త సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.
#WATCH | Delhi: Prime Minister Modi emplanes for Ghana.
PM Modi embarks on a five-nation tour including Ghana, Trinidad and Tobago, Argentina, Brazil, and Namibia. PM Modi will also participate in the BRICS Summit in Brazil.#PMModi #Trending pic.twitter.com/Zjzg9Hhp1O— TIMES NOW (@TimesNow) July 2, 2025
జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయ్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా డిఫెన్స్, ఖనిజాలు, వ్యవసాయం, ఎనర్జీ, వాణిజ్యంపై చర్చ జరపనున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించనున్నారు. జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్‌లో 17వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, ఏఐ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 9న జరిగే నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగించనున్నారు.