వీసా ఫ్రీ.. విదేశాలు! | Philippines is the latest country to join the visa free list | Sakshi
Sakshi News home page

వీసా ఫ్రీ.. విదేశాలు!

Jun 2 2025 12:35 AM | Updated on Jun 2 2025 12:35 AM

Philippines is the latest country to join the visa free list

ఈ జాబితాలోకి ఫిలిప్పీన్స్‌

‘వీసా ఆన్‌ అరైవల్‌’తోనూ..

ఆతిథ్యానికి దేశాలు రెడీ

పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు

విదేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు. సమస్యల్లా వీసా పొందడమే. వీసా అక్కర్లేదు.. పాస్‌పోర్ట్‌ ఉంటే చాలు, ఆతిథ్యం స్వీకరించేందుకు విచ్చేయండి అని భారతీయులను ఆహ్వానించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ఫిలిప్పీన్స్‌ వచ్చి చేరింది. పలు దేశాలు వీసా రహిత ప్రవేశం, వీసా ఆన్‌ అరైవల్, ఆన్‌లైన్‌ వీసాలు (ఈ–వీసాలు) అందించడం ద్వారా పాస్‌పోర్ట్‌ ఉన్న భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేశాయి. - సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

వీసా అవసరం లేకుండానే..
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రకారం 2025 మార్చి నాటికి 25 దేశాలలో భారతీయ పాస్‌పోర్ట్‌ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. దేశాన్నిబట్టి కాల వ్యవధులు, కొన్ని షరతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఎలాంటి వీసా, రోజుల పరిమితి లేకుండా దక్షిణాసియాలో భూటాన్, నేపాల్‌ను చుట్టేయవచ్చు. 

హిందూ మహాసముద్ర ద్వీప దేశాలైన మాల్దీవులు (90 రోజులు అక్కడ ఉండొచ్చు), సీషెల్స్‌ (ముందస్తు ప్రయాణ అనుమతితో 90 రోజులు) భారతీయులను స్వాగతిస్తున్నాయి. మారిషస్‌ సైతం ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తోంది. ఆగ్నేయాసియాలో థాయ్‌లాండ్‌ 60 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. 2026 డిసెంబర్‌లోగా 30 రోజుల పాటు వీసా లేకుండానే మలేషియా చుట్టొచ్చు. 

కరేబియన్‌ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి హాట్‌స్పాట్‌. బార్బడోస్, గ్రెనడా, హైతీ, జమైకా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెడీన్స్‌లో 30 నుండి 90 రోజుల వరకు బస చేయవచ్చు. ఇతర వీసా రహిత దేశాలలో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్‌ ఉన్నాయి.

వీసా ఆన్‌ అరైవల్‌
పాస్‌పోర్టు కలిగిన భారతీయ పౌరులకు వీసా ఆన్‌ అరైవల్‌ 38 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఉన్న దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే వీసా మంజూరు చేస్తారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా–బి స్సావు, జింబాబ్వే.. ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్‌ వీటిలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలైన ఖతార్, ఒమన్‌ కూడా వీసా ఆన్‌ అరైవ ల్‌ అందిస్తున్నాయి. కరేబియన్‌ మళ్ళీ ఇక్కడ బలంగా ఉంది. సెయింట్‌ లూ సియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ గ్రెనడీన్స్‌ సైతం ఈ జాబితాలో నిలిచాయి.

ఈ–వీసా 62 దేశాల్లో.. 
భారత పౌరులకు 62 దేశాలు ఈ–వీసా ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలకు వెళ్లే ఔత్సాహికులు రాయబార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో ఆన్‌లైన్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్హతలనుబట్టి మంజూరు చేస్తారు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్‌ ఎలక్ట్రానిక్‌ వీసా అందిస్తున్నాయి. 

కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియా, రష్యా వంటి మధ్య ఆసియా, యురేషియా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ–వీసాలను పొందవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సైతం భారతీయ పౌరులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. 

లాటిన్‌ అమెరికా, కరేబియన్‌లలోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. పశ్చిమాసియాలోని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్‌ కూడా ఈ–వీసాలను ఆఫర్‌ చేస్తున్నాయి. బుర్కినా ఫాసో, బెనిన్, సావో టొమే అండ్‌ ప్రిన్సిపే, ఈక్వటోరియల్‌ గినియా ఈ జాబితాలో ఉన్నాయి.

టాప్‌–10 వీసా–ఫ్రీ దేశాలు
పర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, ప్రకృతి సుందర దృశ్యాలు, నోరూరించే వంటకాలు, జీవ వైవిధ్యం పరంగా ఎక్కువ మంది సందర్శించడానికి ఇష్టపడేవి.. థాయ్‌లాండ్, నేపాల్, మారిషస్, భూటాన్, మలేషియా, డొమినికా, కెన్యా, శ్రీలంక, ఖతార్, సీషెల్స్‌.

కొన్ని మార్గదర్శకాలు
వీసా రహిత దేశాలకు ప్రయాణించే భారతీయులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. ఎన్ని రోజులు ఆ దేశంలో ఉండొచ్చు, నిర్దిష్ట ప్రవేశ అర్హతలు ధ్రువీకరించుకోవాలి. పాస్‌పోర్ట్‌ కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే దేశాన్ని బట్టి ఖర్చులకు సరిపడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉంచడమేగాకుండా అందుకు ఆధారాలనూ చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ బస చేస్తున్నదీ హోటల్‌ వివరాలు సమర్పించాలి.  

Advertisement
 
Advertisement
Advertisement