తిరుచ్చి: పెరంబలూరు జిల్లా తిరుమందరై అటవీ ప్రాంతం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో రౌడీ షీటర్‌ను పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాల్చి చంపారు. విచారణ తీసుకెళ్తుండగా తప్పించుకునేందుకు యత్నించాడు. ఎస్‌ఐపై దాడి చేసి.. పోలీసు వాహనంపై నాటు బాంబు విసిరి పారిపోవడానికి ప్రయత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిని మదురైలోని మేల అనుప్పనడికి చెందిన రౌడీ షీటర్ సి. కొట్టు రాజా(అళగురాజా)గా గుర్తించారు. ఇతనిపై మదురై, తూత్తుకుడి జిల్లాల్లో హత్య, హత్యాయత్నంతో సహా ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
అళగురాజా.. నాటు బాంబును పోలీసు వాహనంపై విసిరి, వేటకొడవలితో ఎస్‌ఐ శంకర్‌పై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ నందకుమార్ కాల్పులు జరపగా.. తూటా అళగురాజా తలకు తగిలింది. దీంతో రౌడీషీటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ శంకర్‌ను చికిత్స నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.


