లాయర్లతో కలిసి వాకథాన్‌లో పాల్గొన్న జస్టిస్ బీఆర్ గవాయ్
కక్షిదారుల పట్ల సేవా దృక్పథంతో మెలగాలి
ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి
సీజేఐ జస్టిస్ గవాయ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది కేవలం దాతృత్వ చర్య మాత్రమే కాదని.. అదొక నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. న్యాయ సహాయ ఉద్యమంలో పాల్గొనేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, కక్షిదారుల పట్ల సేవాదృక్పథంలో మెలగాలని సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ యంత్రాంగాల బలోపేతం’అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపుతోపాటు ‘లీగల్ సర్విసెస్ డే’కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు.
తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్విసెస్ అథారిటీ(నల్సా), స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల్లో సలహా కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. విధానపరమైన ప్రణాళికలు సజావుగా కొనసాగేలా చూడడానికి ఈ కమిటీలు అవసరమని చెప్పారు. న్యాయ సహాయం అనేది ప్రభుత్వ పరిపాలనలో ఒక భాగమని వివరించారు. ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
న్యాయ సహాయకులు న్యాయ పాలకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. తాను ‘నల్సా’లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించానని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. అప్పట్లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కలిసి పనిచేశానని చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కలిసి వెళ్లేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. మన రాజ్యాంగ ఆత్మ వ్యక్తీకరణకు న్యాయ సహాయ ఉద్యమం ఒక చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు.
ఉత్సాహంగా లాయర్ల వాకథాన్
ఢిల్లీలో ఆదివారం లాయర్ల వాకథాన్ ఉత్సాహంగా జరిగింది. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ వికాస్ సింగ్ జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ఇండియా గేట్ దాకా లాయర్ల నడక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ సహా 2,000 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే వాకథాన్ సందర్భంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు.


