
ఆపరేషన్ సిందూర్‌పై వాడీవేడీ చర్చ
పార్లమెంట్‌లో సోమవారం కొనసాగిన రభస
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో పట్టుబట్టిన విపక్షసభ్యులు
పార్లమెంట్ మకర ద్వారం ముందు విపక్షాల ఆందోళనలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉదంతం, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్లకు తలొగ్గి సోమవారం వివరణలతో చర్చను మొదలెట్టిన అధికార పక్షం, ప్రభుత్వ వివరణను తీవ్రంగా తప్పుబడుతూ విపక్షసభ్యులు చేసిన నినాదాలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. ప్రభుత్వం తరఫున రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు లోక్‌సభలో సుదీర్ఘంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనను బలంగా వినిపించారు. ఇదేసమయంలో జైశంకర్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకోవడం, అడ్డుకున్నందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించడంతో సభలో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఓవైపు ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుండగానే బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణపైనా చర్చ జరపాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో సభ పలుమార్లు వాయిదాపడి చివరకు అర్థాంతరంగా ముగిసి మంగళవారానికి వాయిదాపడింది.
పాక్ కాళ్లబేరానికి వచ్చింది
తొలుత లోక్‌సభలో ఆపరేషన్‌సిందూర్‌పై చర్చపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ అనేది ముమ్మాటికీ చరిత్రాత్మకమైన సైనిక చర్య. ఉగ్రవాదంపై అత్యంత ప్రభావవంతమైన భారత విధానాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటింది. యుద్ధరంగంలో తమ ధైర్యసాహసాలను ప్రదర్శించిన ధైర్యవంతులైన సైనికులందరికీ నా సెల్యూట్. పాక్ పౌరులకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్‌కు పథకరచన చేశారు.
కేవలం ఉగ్రవాదులకే భారీ నష్టం చేకూర్చాం. కేవలం 22 నిమిషాల్లో 9 కీలక ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి మన సత్తా చాటాం. ఊహించని మెరుపుదాడితో చేష్టలుడిగిన పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) స్వయంగా ఫోన్ చేసి తమకు ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశ్యంలేదని స్పష్టంచేశారు. ఆలోపు పాక్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడులను మన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా నిర్వీర్యంచేశాయి.
మన దాడులకు ప్రతీగా పాక్ జరిపిన దాడుల్లో భారత్‌లో ఏ ఒక్క కీలక స్థావరం, ఆయుధాగారం దెబ్బ తినలేదు. ఉగ్రవాదుల స్థావరాలు, వాళ్లకు మద్దతిచ్చేవాళ్లను అంతంచేసేందుకే ఆ ఆపరేషన్. లక్ష్యం నెరవేరిన కారణంగానే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశాం. ఇందులో ఎవరి బలవంతం, ప్రోద్బలం, ప్రమేయం లేవు. బయటిశక్తుల (అమెరికా, ట్రంప్) కారణంగానే పాక్‌పై మనం దాడులను ఆపేశామనడంలో వాస్తవం లేదు.
భారత వాయుసేన అసాధారణ దాడులు, సరిహద్దు వెంట ఆర్మీ దీటైన జవాబుకు తోడు నావికాదళం దాడులకు దిగొచ్చన్న భయాలతో పాక్ కాళ్లబేరానికొచ్చింది’’ అని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. ‘‘మమ్మల్ని విపక్షాలు అడగదల్చుకుంటే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందా? అని ఒక్కటే ప్రశ్న వేయాలి. అందుకే మేం అవును అని సూటి సమాధానం చెప్తాం. పాక్ దాడుల్లో మన సైనికులెవరూ వీరమరణం పొందలేదు.
ఏ పరీక్షలోనైనా ఫలితమే ముఖ్యం. పరీక్ష రాసేటప్పుడు పెన్సిల్ విరగడము, కలం కనిపించకుండా పోవడమూ సాధారణం. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే ముఖ్యం. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను సైనికదళాలు 100 శాతం కచ్చితత్వంతో సాధించాయి. పాక్‌తోగానీ మరే ఇతర దేశంతోగానీ ఎప్పుడూ విజయవంతమైన ప్రభుత్వాల సారథ్యంలో స్నేహాన్నే భారత్ కోరుకుంటోంది.
గతంలో భారత్ ‘లాహోర్ బస్సు యాత్ర’ బాషలో మాట్లాడితే ధూర్త పాక్‌కు బోధపడలేదు. వాళ్లకు అర్థమయ్యేలా ఈసారి మేం ‘బాలాకోట్ దాడి’ భాషలో మాట్లాడాం. భారత్ ఏ దేశంతోనైనా కరచాలనం కోసం స్నేహహస్తమే అందిస్తుంది. చేతిని మెలిపెట్టాలని చూస్తేమాత్రం ఆ చేతినే విరిచేస్తుంది.
పౌరుల ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తే భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడుతుంతో ఆపరేషన్ సిందూర్ కళ్లకుకట్టింది. భారత్‌ను ఏనాటికీ ఓడించలేమని పాక్ పాలకులకు అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారు. కానీ అది వాళ్లనే మింగేస్తోంది. అమాయక పాక్ ప్రజలనూ చంపేస్తోంది. ఆపరేషన్ ముగియలేదు. పాక్ మళ్లీ తోక జాడిస్తే మళ్లీ సిందూర్ మొదలవుతుంది’’ అని రాజ్‌నాథ్ అన్నారు.
వాణిజ్య అంశాల్లో సిందూర్ ప్రస్తావన రాలేదు:
జైశంకర్‌ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వేళ ట్రంప్, మోదీ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదు. అమెరికాతో వాణిజ్యానికి, ఈ ఆపరేషన్‌కు సంబంధం లేదు. ది రెసిస్టెంట్ ఫ్రంట్‌ను అంతర్జాతీయ ఉగ్రసంస్థగా ప్రకటించడంలో విజయంసాధించిన భారత దౌత్యానికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.
మనం పాక్ నడిబొడ్డులోని బహావల్పూర్, మురిద్కేలోని స్థావరాలను నేలమట్టంచేయగలమని ఎవరైనా ఊహించారా?. పహల్గాం దాడిని బ్రిక్స్, క్వాడ్ కూటములేకాదు ఎన్నో దేశాలు ఖండించాయి. పాక్‌పై దాడిచేశాక దాడులను ఆపాలని పాక్ నుంచే అభ్యర్థన వచ్చింది. కానీ మేం పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) నుంచి అభ్యర్థన వస్తేనే ఆపుతామని చెప్పాం’’ అన్నారు.
ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం..
విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రసంగిస్తుంటే విపక్ష సభ్యులు పదేపదే అడ్డుత గిలారు. హోం మంత్రి అమిత్ షా జోక్యంచేసుకుని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ సభ్యులు అస్సలు విశ్వసించట్లేరు. బయటివాళ్లు (ట్రంప్) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌కు నమ్మకం ఎక్కువ. మీ పార్టీలో విదేశీయుల అభిప్రాయాలకు ఎంతటి విలువుందో ఇప్పుడే తెలుస్తోంది. మీ అభిప్రాయాలను పార్లమెంట్‌పై రుద్దకండి. విదేశీయులను నమ్మినందుకే మీరు విపక్షంలో కూర్చున్నారు. ట్రంప్ వంటి విదేశీయుల మాటలను ఇలాగే నమ్ము తూ పోతే మీరు ఇలాగే మరో 20 సంవత్సరాలు విపక్షంలోనే ఉండిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.
ప్రశ్నలు కురిపించిన కాంగ్రెస్
చర్చలో కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో ఉపనేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ‘‘ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకునే ఉద్దేశం మోదీ సర్కార్‌కు లేనట్లుంది. నిజంగా తిరిగి హస్తగతం చేసుకునే ఆలోచనే ఉంటే హఠాత్తుగా ఆపరేషన్ సిందూర్‌ను ఎందుకు ఆపాల్సి వచ్చింది?. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పీఓకేను స్వాధీనంచేసుకుంటాం?. పాక్, భారత్ పరస్పర సైనిక చర్యలకు ముగింపు పలికింది తానేనని ట్రంప్ 26 సార్లు ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?.
భారత్, పాక్ యుద్దం ఆపితేనే వాణిజ్యం కొనసాగి స్తానని ట్రంప్ అమెరికా వాణిజ్య కత్తిని చూపి బెదిరించారా?. ఇంట్లో చొరబడి మరీ చంపుతామని ఇప్పటికి ఎన్నోసార్లు మోదీ అదే డైలాగ్‌లు కొడుతున్నారు. మరి సిందూర్ పరిసమాప్తంకాలేదని, పాక్ దాడిచేస్తే మళ్లీ మొదలవుతుందని వాళ్లే చెబుతున్నారు. అలాంటప్పుడు సిందూర్ విజయవంతమైందని ఎలా అంటారు? యుద్ధం చేయడం తమ విధానం కాదంటారు? మరి సిందూర్‌వేళ చేసిందేంటి? వాళ్ల అధీనంలోని భూభాగాన్ని స్వాధీనంచేసుకోవడానికి సిందూర్ చేయలేదంటున్నారు. మరి దేని కోసం చేసినట్లు? సిందూర్ వేళ ఎన్ని యుద్ధవిమానాలను కోల్పోయాం?’’ అని గొగోయ్ ప్రశ్నించారు.
డిప్యూటీ ఛైర్మన్‌కు 26 నోటీసులు
బిహార్ ఓటర్ల జాబితా అంశంతోపాటు ఇతర రాష్ట్రాల్లో బెంగాళీ వలసకూలీలు వివక్షను ఎదుర్కొనే పలు అంశాలపై రాజ్యసభలో చర్చించాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు మొత్తం 26 వాయిదా తీర్మానాలు వచ్చాయి. వీటన్నింటినీ ఆయన తోసిపుచ్చారు. జోరీఅవర్ సెషన్‌ను మొదలుపెట్టాలని నామినేటెడ్ సభ్యురాలు సుధామూర్తిని హరివంశ్ కోరగానే విపక్షసభ్యులు ఆందోళన పెంచారు. ఓటు చోరీని ఆపాలి అని నినాదాలుచేశారు.
దీంతో మధ్యాహ్నం సెషన్‌లోపే సభ రెండుసార్లు వాయిదాపడింది. తర్వాత సభ మొదలైనా మళ్లీ ఇదే పునరావృతమైంది. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షసభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలిస్తూ సభ జరక్కుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక సభను మంగళవారానికి వాయిదావేశారు. ó డీ చర్చ