
చింద్వారా: అప్పుడే పుట్టిన ఆ శిశువు దట్టమైన అడవిలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఒంటరిగా విలవిలలాడిపోయింది. భూమిపై పడిన కొద్ది గంటలకే చీమలకు బలయ్యింది. ఇది మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో చోటుచేసుకున్న అత్యంత దారుణ ఉదంతం. తల్లిదండ్రులే అత్యంత కర్కశంగా ఆ చిన్నారిని అడవిలో ఒక రాయి పక్కన వదిలివేశారు. ఆ శిశువు రాత్రంతా తీవ్రమైన చలిలో చీమలు, కీటకాల దాడితో తల్లడిల్లిపోయింది. అయితే తెల్లవారుజామున శిశువు ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు శిశువును సజీవంగా కాపాడి, వైద్య సంరక్షణ అందించారు.
మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో ఉన్న నిబంధనలకు భయపడి ఆ శిశువు తల్లిదండ్రులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన బబ్లు దండోలియా తనకు నాల్గవ సంతానం కలిగిన దరిమిలా, ప్రభుత్వ ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. దీంతో తన భార్య రాజకుమారి దండోలియా సాయంతో తమ ముక్కుపచ్చలారని బిడ్డను అడవిలో వదిలేసి వచ్చారు. రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి ఉపాధిని పరిమితం చేసే ప్రభుత్వ నిబంధన అమలులో ఉంది. దీంతో వారు ఉద్యోగం కోల్పోతామని భయపడి, రాజకుమారి దండోలియా గర్భధారణను రహస్యంగా ఉంచారు. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.
సెప్టెంబర్ 23 తెల్లవారుజామున రాజకుమారి తమ ఇంట్లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వెంటనే ఆ దంపతులు ఆ శిశువును అడవికి తీసుకెళ్లి, ఒక రాయి పక్కన వదిలేసి వచ్చారు. మర్నాటి ఉదయం నందన్వాడి గ్రామస్తులు ఆ శిశువు ఆర్తనాదాలను విన్నారు. వెంటనే శిశువును చింద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ నవజాత శిశువు వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. కేసును ఛేదించిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)సెక్షన్ 93 కింద ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. పోలీసు అధికారిణి కళ్యాణి బర్కడే మాట్లాడుతూ, ఈ ఉదంతంలో తాము సీనియర్ అధికారులను సంప్రదిస్తున్నామని, చట్టపరమైన సమీక్ష తర్వాత హత్యాయత్నంతో సహా మరిన్ని సెక్షన్లను జోడిస్తామని తెలిపారు.