
ముంబైలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబైలో అత్యవసర ల్యాండ్ చేసిన పైలట్.. ‘ప్యాన్ ప్యాన్ ప్యాన్’ అంటూ సంకేతమిచ్చారు. ప్రాణాపాయం ఏమీ లేదు కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ కావాల్సి ఉందంటూ సంకేత భాషలో పైలట్ సందేశం పంపించారు.
నిన్న(బుధవారం) ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి గోవా బయలేరిన ఇండిగో ఎయిర్‌బస్ ఏ320 నియో విమానంలో సమస్య తలెత్తింది. గాలిలో ఉండగా.. ఒక ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ ‘ప్యాన్.. ప్యాన్.. ప్యాన్’ సంకేత భాషలో సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 9.53 గంటల ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో ల్యాండ్ చేశారు. విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతికలోపం తలెత్తడంతో విమానాన్ని ముంబైకి దారి మళ్లించినట్ల పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
కాగా, గత నెల ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం నుంచి ‘మేడే కాల్’ వచ్చిన సంగతి తెలిసిందే. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు.
సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.