ఇద్దరు ఆదిల్‌ల కథ | Pahalgam terror attack, one Aadil caused bloodshed, another Adil took bullets | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆదిల్‌ల కథ

Apr 26 2025 4:08 AM | Updated on Apr 26 2025 12:14 PM

Pahalgam terror attack, one Aadil caused bloodshed, another Adil took bullets

ఉన్మాదిగా మారి స్వదేశీయులనే కాల్చిందొకడు 

తూటాలకు ఎదురొడ్డిన ప్రాణత్యాగం మరొకరిది 

గుణపాఠంగా నిలుస్తున్న ఇద్దరు కశ్మీరీల జీవితం

శ్రీనగర్‌: ఇద్దరూ కశ్మీరీలే. ఇద్దరి పేరూ ఒకటే. కానీ ఒక ఆదిల్‌ మతోన్మాదంతో పాక్‌ ముష్కర ముఠాలో భాగమై స్వదేశీయులపైనే కాల్పులకు తెగబడ్డాడు. కశ్మీర్‌ ప్రతిష్టకే మాయని మచ్చలా మిగిలాడు. మరో ఆదిల్‌ ఆ తూటాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచాడు. పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలర్పించాడు. మొదటివాడు పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డ ఏడుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల్లో ఒకడైన ఆదిల్‌ హుసేన్‌ ఠోకర్‌ అలియాస్‌ ఆదిల్‌ గురీ. వారిని ప్రతిఘటించిన సయీద్‌ ఆదిల్‌ హుసేన్‌ షా స్థానిక పోనీవాలా. కశ్మీర్‌ (Kashmir) పర్యాటకానికి చెడ్డపేరు రాకుండా అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడిన అతని ధైర్యసాహసాలను దేశమంతా ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది.

టీనేజీలోనే... 
20 ఏళ్లు దాటిన ఆదిల్‌ ఠోకర్‌ స్వగ్రామం దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా ప్రాంతంలోని గురీ. టీనేజర్‌గా ఉండగానే 2018లో పాక్‌ బాట పట్టాడు. అధికారిక పత్రాలతోనే వెళ్లినా కొద్ది రోజులకే పాక్‌లోనే ‘మాయమైపోయాడు’. పాక్‌కు చెందిన నిషేధిత లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో చేరినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. తోటి ముష్కరులతో కలిసి 2024లో నియంత్రణ రేఖ గుండా భారత్‌లోకి చొరబడ్డట్టు నిర్ధారించుకున్నాయి. 

అప్పటినుంచీ జమ్మూలోని దోడా, కిష్త్‌వార్‌ తదితర ప్రాంతాల్లో ఆదిల్‌ ఠోకర్‌ మారణహోమం సృష్టిస్తున్నాడు. లోయలో ఏడాదిన్నరగా జరిగిన పలు ఉగ్ర ఘటనల్లో కూడా అతని హస్తమున్నట్టు తేలింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఏడుగురిలో ఐదుగురు పాకిస్తానీలు కాగా ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదులు. ఠోకర్‌ వారిలో ఒకడని దాడిలో చనిపోయిన ఓ వ్యక్తి భార్య నిర్ధారించింది. పోలీసులు తమకు చూపిన ఫొటోల ద్వారా అతన్ని గుర్తు పట్టింది. ‘‘నా భర్త తలను తూటాలతో ఛిద్రం చేసింది ఇతనే. దాడి తర్వాత తోటి ఉగ్రవాదులతో కలిసి అడవిలోకి మాయమయ్యాడు’’ అని వివరించింది. 

దేశమంతా జేజేలు 
గుర్రాలను నడుపుకునే 30 ఏళ్ల ఆదిల్‌ హుసేన్‌ షాది పహల్గాం (Pahalgam). కర్కశ దాడికి వేదికైన బైసారన్‌ మైదానాల్లోకి రోజూ గుర్రాలపై పర్యాటకులను చేరవేస్తుంటాడు. దాడి వేళ తోటి స్థానికుల్లా తనకెందుకు లెమ్మని అనుకోలేదు. ముష్కరులు కేవలం హిందువులనే లక్ష్యం చేసుకుంటున్నా, తనకు ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిసినా ఊరుకోలేదు. తనవంటివారికి జీవనాధారమైన పర్యాటకులను కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నించాడు.

చ‌ద‌వండి: ఆ క్ష‌ణంలోనే చ‌నిపోయేవాడిని.. అందుకే బ‌తికివున్నా..

ఒక ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కోబోయాడు. ఆ ప్రయత్నంలో కాల్పులకు బలయ్యాడు. మూడు తూటాలు ఆదిల్‌ ఛాతీని ఛిద్రం చేశాయి. తన పిల్లలందరిలోనూ ఆదిలే అత్యంత దయా స్వభావి అంటూ తండ్రి సయీద్‌ హైదర్‌ షా కన్నీటి పర్యమంతమయ్యాడు. ఆదిల్‌ అంత్యక్రియలకు జనం భారీగా పోటెత్తారు. జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (Omar Abdullah) కూడా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement