ఆపరేషన్‌ సిందూర్‌ బలమైన భారత్‌కు ప్రతీక  | Operation Sindoor is not a military mission, but a reflection of changing India | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్‌ బలమైన భారత్‌కు ప్రతీక 

May 26 2025 1:09 AM | Updated on May 26 2025 6:46 AM

Operation Sindoor is not a military mission, but a reflection of changing India

ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్‌ పాయింట్‌   

మన సైనిక దళాల ధైర్య సాహసాలు గర్వకారణం  

ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని చాటిచెప్పాం  

మన ఉమ్మడి శక్తి, దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదే  

స్వదేశీ ఉత్పత్తులకే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి  

వచ్చే 21న యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలి  

‘మన్‌కీ బాత్‌’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు  

న్యూఢిల్లీ:  ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన అపూర్వ ధైర్య సాహసాలు ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం యావత్తూ ఒక్కతాటిపైకి వచ్చిందని అన్నారు. ఉగ్రవాద శిబిరాలపై మన సైన్యం కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడం అద్భుతం అని కొనియాడారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ఒక సైనిక ఆపరేషన్‌ కాదని.. బలీయమైన శక్తిగా ఎదుగుతున్న భారతావనికి అసలైన ప్రతీక అని వివరించారు. ప్రపంచ వేదికపై మన శక్తి సామర్థ్యాలు, సంకల్పం, పెరుగుతున్న బలాన్ని ఈ ఆపరేషన్‌ కళ్లకు కట్టిందని హర్షం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై ప్రపంచం సాగిస్తున్న పోరాటంలో ఆపరేషన్‌ సిందూర్‌ ఒక టర్నింగ్‌ పాయింట్‌ అని అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదంటూ మరోసారి దృఢంగా చాటిచెప్పామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆదివారం 122వ ‘మన్‌కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

పలు అంశాలను ప్రస్తావించారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారతీయుల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించిందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నేడు దేశమంతా ఏకమైందని, ఉగ్రవాద భూతం అంతం కావాలన్న సంకల్పం వారిలో ఏర్పడిందని ఉద్ఘాటించారు. మన ఉమ్మడి శక్తిని, దేశభక్తిని చాటాల్సిన సమయం ఇదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. మన నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు స్వదేశీ ఉత్పత్తులే వాడుకుందామని, విదేశీ ఉత్పుత్తులపై ఆధారపడడం తగ్గించుకుందామని, ఈ మేరకు మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ఇంకా చెప్పారంటే...  

స్వశక్తితో దక్కిన విజయం  
‘‘స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఆర్థిక స్వయం స్వావలంబనకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశ నిర్మాణంలో పాలుపంచుకొనే అంశమని గుర్తుంచుకోవాలి. మనం వేసే ఒక్క అడుగు దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై ఎంతోమంది పాటలు, గేయాలు రాశారు. పిల్లలు పెయింటింగ్స్‌ వేశారు. దేశమంతటా తిరంగా యాత్రలు నిర్వహించారు. ఇటీవల రాజస్తాన్‌లోని బికనీర్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి పెయింటింగ్స్‌ పిల్లలను నాకు బహూకరించారు.

 కొందరు తల్లులు అప్పుడే జన్మించిన తమ బిడ్డలకు ‘సిందూర్‌’ అని పేరు పెట్టుకున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక మన స్వశక్తి ఉంది. దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ఆయుధాలతో ఉగ్రవాదులను అణచివేశాం. మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తితో రక్షణ పాటవం పెంచుకోవడంపై దృష్టిం పెట్టాం. మేడ్‌ ఇన్‌ ఇండియా ఆయుధాలు, రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి తోడు మన సైనికుల శౌర్య ప్రతాపాలు విజయం సాధించి పెట్టాయి. మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల స్వేదం, ప్రజల భాగస్వామ్యంతో ఈ గెలుపు సొంతమైంది’’ అని మోదీ అన్నారు.  

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వెలుగులు   
‘‘మావోయిజంపై సమ్మిళిత పోరాటంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. పౌర సేవలు అందుతున్నాయి. బస్సు సరీ్వసులు నడుస్తున్నాయి. అక్కడ చిన్నారులు చదువుకుంటున్నారు. మావోయిస్టుల ప్రభావం చాలావరకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో గడ్చిరోలీ జిల్లాలోని కాతేఝారీ గ్రామానికి తొలిసారి బస్సు వచ్చినప్పుడు ప్రజలు మేళతాళాలతో స్వాగతం పలికారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, దంతేవాడ ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి.

 సైన్స్‌ ల్యాబ్‌లు కూడా వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పదో తరగతి ఫలితాల్లో దంతెవాడ జిల్లా మొదటి స్థానంలో, 12వ తరగతి ఫలితాల్లో ఆరో స్థానంలో నిలవడం సంతోషం కలిగించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారులు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. గర్వపడే విజయాలు సాధిస్తున్నారు. సైన్స్‌పైనా వారికి ఆసక్తి పెరుగుతోంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ప్రజలు వాటిని లెక్కచేయకుండా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. తమ జీవితాలను బాగు చేసుకోవాలన్న తపన వారిలో మొదలైంది’’ అని మోదీ చెప్పారు.  

 

యోగాతో జీవన విధానంలో మార్పు   
‘‘జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జరిగే యోగా డే కార్యక్రమానికి నేను హాజరవుతున్నా. ‘యోగ్‌ ఆంధ్రా అభియాన్‌’లో భాగంగా 10 లక్షల మంది యోగా అభ్యాసకులను తయారు చేయబోతున్నారు. మన జీవన విధానాన్ని యోగా మార్చేస్తుంది. పాఠశాలల్లో చక్కెర బోర్డులు ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈ నిర్ణయించడం హర్షణీయం. చక్కెర వినియోగం, దానివల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించబోతున్నారు. క్యాంటీన్లు, కార్యాలయాల్లోనూ ఇలాంటి బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. 

పర్యావరణ పరిరక్షణ కోసం ఐటీబీపీ జవాన్లు చేసిన ప్రయత్నం నన్ను ఆకట్టుకుంది. వారు మకాలూ పర్వతంపైకి వెళ్లి, 150 కిలోల వ్యర్థాలను కిందికి తీసుకొచ్చారు. పర్వతాన్ని శుభ్రం చేయడం మామూలు విషయం కాదు. పట్టుదల, అంకితభావం ఉంటే మార్గం అదే దొరుకుతుందని వారు నిరూపించారు. కాగితాలను వృథా చేయడం ఇటీవల బాగా పెరిగింది. భూమిలో చేరుతున్నవాటిలో కాగితపు వ్యర్థాలే అధికంగా ఉంటున్నాయి. అందుకే కాగితం పునరి్వనియోగంపై దృష్టి పెట్టాలి. విశాఖపట్నం, గురుగ్రాం, జాల్నాలోని కొన్ని స్టార్టప్‌ కంపెనీలు ప్యాకేజింగ్‌ బోర్డులు, పేపర్‌ ఉత్పత్తులను రీసైకిల్‌ చేస్తున్నాయి’’ అని ప్రధాని మోదీ వివరించారు.  

‘భారతదేశ స్వావలంబన’ రుచిని ఆస్వాదించండి  
‘‘గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో ఆసియా సింహాల సంఖ్య 674 నుంచి ఐదేళ్లలో 891కి చేరుకుంది. ఇది నిజంగా ఎంతో ప్రోత్సాహకరమైన ప్రగతి. అక్కడి ప్రజల ఉమ్మడి కృషి, ఆధునిక విధానాలతో ఇది సాధ్యమైంది. గుజరాత్‌లో 11 జిల్లాల పరిధిలో 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆసియా సింహాలు ఉన్నాయి. వాటి సంతతి క్రమంగా పెరుగుతోంది. చుట్టూ ఉన్న జంతుజాలం మనదే అనే భావన ప్రజల్లో ఏర్పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ నెల 20న ప్రపంచ తేనెటీగల దినం నిర్వహించుకున్నాం. 

ఆరోగ్యం, స్వయం ఉపాధి, స్వయం సమృద్ధికి తేనె ఒక గుర్తు. దేశంలో గత 11 ఏళ్లుగా తీపి విప్లవం జరుగుతోంది. ప్రతిఏటా 70–75 వేల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న తేనె ఉత్పత్తి ఇప్పుడు 1.25 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరింది. అంటే ఉత్పత్తి 60 శాతం పెరిగింది. తేనె ఉత్పత్తి, ఎగుమతిలో మనం ముందంజలో ఉన్నాం. నేషనల్‌ బీకిపింగ్, హనీ మిషన్‌తో ఎంతో మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతులు ‘సొన్‌హనీ’ పేరుతో ఆర్గానిక్‌ తేనె ఉత్పత్తి చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. కేవలం పరిమాణమే కాదు, నాణ్యమైన తేనె ఉత్పత్తిపైనా మనం దృష్టి పెట్టాం. స్థానిక రైతులు, మహిళా వ్యాపారుల నుంచి తేనె కొనుగోలు చేయండి. భారతదేశ స్వావలంబన రుచిని అందరూ ఆస్వాదించండి’’ అని మోదీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement