కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి | Sakshi
Sakshi News home page

కశ్మీరీల్లో అపనమ్మకాన్ని తొలగించాలి

Published Sun, Jun 27 2021 4:03 AM

Omar Abdullah Seeks Delimitation, Jammu Kashmir Statehood Before Election - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాను బలవంతంగా తీసేయడంతో కశ్మీరీల్లో నెలకొన్న అపనమ్మకాన్ని కేంద్రప్రభుత్వం తొలగించాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్లుల్లా సూచించారు. విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్పనతోపాటు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వాలని ఆ పార్టీ నేత ఒమర్‌ అబ్దుల్లా కోరారు. కశ్మీర్‌లో రాజకీయాలకు పునరుజ్జీవం పోసేందుకు ప్రధాని మోదీతో అఖిలపక్ష సమావేశంలో తమ డిమాండ్లను స్పష్టం చేశాక శ్రీనగర్‌ చేరుకున్న ఫరూఖ్, ఒమర్‌లు శనివారం మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణ వివరాలను తమ పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ) సభ్యులతో మాట్లాడాకే వెల్లడిస్తామని వారు చెప్పారు.

‘జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిపై నాడు జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రజాభిప్రాయం ద్వారా సాకారం చేస్తానని మాటిచ్చి తర్వాత వెనకడుగు వేశారు. ఆ తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు సైతం పార్లమెంట్‌ సాక్షిగా మాటిచ్చారు. మేమెన్నడూ స్వాతంత్య్రం కావాలని అడగలేదు. స్వతంత్ర ప్రతిపత్తే కావాలన్నాం. ఇప్పుడు అదెక్కడుంది?. రాష్ట్ర హోదా తీసేసి కశ్మీరీల్లో ఉన్న నమ్మకాన్ని కేంద్రం పోగొట్టుకుంది. ఇక మీదటైనా కేంద్ర ప్రభుత్వం నమ్మకం పెరిగేలా ఏదైనా చేస్తుందేమో చూస్తాం’ అని ఫరూఖ్‌ మీడియాతో అన్నారు. గుప్కార్‌ అలయన్స్‌కు ఇక ముగింపు పలకనున్నా రనే వాదనలను ఆయన కొట్టిపారేశారు.

‘నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఆ తర్వాతే రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి మేం అస్సలు ఒప్పకోం. రాష్ట్ర హోదా ఇచ్చాకే ఎన్నికలు పెట్టండి’ అని ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష భేటీ తర్వాత గుప్కార్‌ అలయన్స్‌లో ఐక్యత లోపించిందనే వాదనను ఒమర్‌ తోసిపుచ్చారు. ‘ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలనే తమ కలను బీజేపీ 70 ఏళ్ల తర్వాత సాకారం చేసుకుంది. మేం కూడా పోరాటంలో విజయం సాధించేందుకు 70 వారాలు.. 70 నెలలు.. అంతకంటే ఎక్కువ కాలం పట్టినా సరే ఎన్నాళ్లయినా పోరాడతాం’ అని ఒమర్‌ అన్నారు.   

Advertisement
Advertisement