పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని భావిస్తున్నారు. జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంలతో కూడిన నూతన ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి పట్నాలోని గాంధీ మైదానం వేదికకానుంది.
జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ నవంబర్ 20 (గురువారం)న బిహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని గాంధీ మైదానంలో నిర్వహించనున్నారని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఝీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ఎన్డీఏ అగ్ర నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారన్నారు.
ఈ కార్యక్రమం కోసం గాంధీ మైదాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం నవంబర్ 17 నుండి 20 వరకు గాంధీ మైదాన్‌ను సాధారణ ప్రజల సందర్శనకు మూసివేయనున్నారు. కాగా మిత్రపక్షాల మధ్య క్యాబినెట్ పదవుల పంపిణీకి ఫార్ములాను ఖరారు చేసినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. జెడీయూ,బీజేపీతో పాటు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జెపీ (ఆర్‌వీ), మాంఝీ నేతృత్వంలోని హెచ్ఎఎంఎస్, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్ఎంలు నూతన ప్రభుత్వంలో చేరనున్నాయి. రాష్ట్ర నూతన మంత్రివర్గంలో ఎల్జేపీ (ఆర్‌వీ)కి మూడు బెర్తులు లభించే అవకాశం ఉంది. హెచ్ఎఎంఎస్, ఆర్ఎల్ఎంలకు ఒక్కొక్క బెర్తు లభించనున్నదని సమాచారం.


