
ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
చెన్నై: అమెరికాలో నిర్మించిన 6,500 కిలోల బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని మరో రెండు నెలల్లో ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. సానా–ఇస్రోలు కలిసి జూలై 30వ తేదీన నైసార్ మిషన్ ప్రయోగం చేపట్టడం తెల్సిందే. ఇస్రో చైర్మన్ ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇస్రో 1963లో ఏర్పాటు కాగా అదే ఏడాది అమెరికా బహుమతిగా అందజేసిన చిన్నపాటి రాకెట్‌తో భారత అంతరిక్ష యాత్ర మొదలైందని ఈ సందర్భంగా నారాయణన్ గుర్తు చేశారు.
ఇస్రో ప్రస్థానంలో ఈ జూలై 30వ తేదీ చరిత్రలో నిలిచిపో నుందని పేర్కొన్నారు. మనం ప్రయోగించిన నైసర్ ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన శాటిలైట్ అని వివరించారు. మరో రెండు నెలల్లో అమెరికా నిర్మించిన 6,400కిలోల భారీ ఉపగ్రహాన్ని సొంత నేలపై నుంచి ప్రయోగించనుండటం మనం సాధించిన ఘనతకు ఉదాహరణ’ అని తెలిపారు. సొంత ఉపగ్రహ టెక్నాలజీయేలేని ఇస్రో 50 ఏళ్లలోనే 34 దేశాలకు చెందిన 433 శాటిలైట్లను ప్రయోగించిన స్థాయికి ఎదిగిందని వివరించారు. దేశాభివృద్ధి కోసం బ్రాడ్ కాస్టింగ్, టెలికమ్యూనికేషన్, డిజాస్టర్ వార్నింగ్, వాటర్ సెక్యూరిటీ తదితర 55 రకాల అప్లికేషన్లను ఇస్రో అందజేస్తోందన్నారు.