
ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
సాక్షి, చెన్నై: రోబోట్‌తో కూడిన మొదటి అంతరిక్ష నౌకను డిసెంబర్‌లో ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 30వ తేదీన శ్రీహరి కోట నుంచి నాసా సహకారంతో ఇస్రో నిషార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులోని ఎస్–బ్యాండ్ సింథటిక్ యాక్సిలేటర్ పూర్తిగా దేశీయంగా తయారు కాగా, మరో ఎల్‌బ్యాండ్ సింథటిక్ యాక్సిలేటర్ అమెరికాలో తయారైందని వివరించారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్(ఎస్‌ఏఆర్) ఉపగ్రహం 24 గంటలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమికి సంబంధించి చక్కటి ఫొటోలను తీస్తుందన్నారు.
సహజ వనరులు, కొండ చరియలు విరిగి పడే విపత్తులను గుర్తిస్తుందన్నారు. ఇది 12 రోజులకోసారి మొత్తం భూమి చిత్రాన్ని తీసి భారత్‌తోపాటు అన్ని దేశాలతో పంచుకుంటుందన్నారు. మానవ రహిత రోబోట్‌తో కూడిన అంతరిక్ష నౌకను శ్రీహరికోటలో సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్రపై దృష్టి పెట్టనున్నామన్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆమోదం తెలిపారని, చంద్రయాన్ –4 పనులు చురుగ్గా జరుగుతున్నాయని, చంద్రయాన్–5 పైనా ఇక దృష్టి పెడుతామని నారాయణన్ పేర్కొన్నారు.