నిమిష ప్రియ కేసు.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కేంద్రం | Nimisha Priya case: MEA denies Permission to visit Yemen | Sakshi
Sakshi News home page

నిమిష ప్రియ కేసు.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కేంద్రం

Aug 2 2025 4:23 PM | Updated on Aug 2 2025 4:38 PM

Nimisha Priya case: MEA denies Permission to visit Yemen

యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్‌ సిగ్నల్‌ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ బృందానికి యెమెన్‌ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్‌ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా  అనుమతించలేమని స్పష్టం చేసింది.

సేవ్‌ నిమిష ప్రియ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ కౌన్సిల్‌ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్‌ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్‌ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.

‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని,  మిగిలిన మార్గం బ్లడ్‌ మనీనే అని, అయితే అది ప్రైవేట్‌ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.

ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే  యెమెన్‌ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్‌ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్‌ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్‌ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్‌ వెళ్లిపోయింది.  ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. 

మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్‌ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 

2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్‌ కుటుంబంతో బ్లడ్‌ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. 

బ్లడ్‌మనీ అంటే.. 
హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement