
ముంబై: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌తో సహా ఆసియాలోని కొన్ని దేశాలలో కోవిడ్-19(COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఈ వివరాలను ఆయా రాష్ట్రాల అధికారులు మీడియాకు వెల్లడించాయి.
మునుపటి వేవ్‌లతో పోలిస్తే మొత్తం కేసులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలోని ముంబై, చెన్నై, అహ్మదాబాద్(Ahmedabad)తో పాటు పలు నగరాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత మే నెలలో ముంబైలో ఇప్పటివరకూ కొత్తగా 95 కేసులు నమోదయ్యాయి. జనవరి నుండి చూసుకుంటే మహారాష్ట్రలో మొత్తంగా 106 కేసులు నమోదయ్యాయి. ఇది గణనీయమైన పెరుగుదల అని నిపుణులు అంటున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 16 మంది కోవిడ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ వ్యాపించకుంగా ఉండేందుకు బాధితులను కెమ్ ఆస్పత్రి నుంచి సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్టులో వెల్లడించింది.
మరోవైపు ముంబై మహా నగరంలో ఇన్ఫ్లుఎంజా(Influenza), శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ముందు జాగ్రత్త చర్యగా పూణేకు చెందిన వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నాయుడు ఆసుపత్రిలో 50 పడకలను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనావైరస్ యాక్టివ్ కేసులు లేవు. ఇటీవల 87 ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ వచ్చిందని, అయితే అతను వైద్య చికిత్సతో కోలుకున్నాడని పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి నీనా బోరాడే తెలిపారు. ఆస్పత్రులలో ప్రస్తుతం ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదని, కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నట్లు నీనా తెలిపారు.
తాజాగా తమిళనాడు, గుజరాత్, కేరళలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అలాగే పుదుచ్చేరిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. చెన్నైలో ఇన్ఫ్లుఎంజాకు కారణమైన జ్వరాలు పెరుగుతున్నాయి. ఇవి కరోనా ఇన్ఫెక్షన్ అనుమానాలను పెంచుతున్నాయి. ప్రస్తుతానికి కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులను నిర్ధారించగా, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా ఏడు కొత్త కేసులు నమోదయ్యాయి. వీరంతా ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. వైద్యులు వీరి నుంచి శాంపిల్స్‌ను సేకరించి, ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: సెమికోలన్ ఎక్కడ?.. ఎందుకు మాయమవుతోంది?