ట్రోలింగ్‌పై సీరియస్‌ | NCW Serious on Himanshi Trolling | Sakshi
Sakshi News home page

హిమాన్షిపై ట్రోలింగ్‌.. NCW సీరియస్‌

May 5 2025 10:57 AM | Updated on May 5 2025 11:32 AM

NCW Serious on Himanshi Trolling

పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో.. నేవీ అధికారి అయిన తన భర్త వినయ్‌ నర్వాల్‌ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతంగా‌ ట్రోలింగ్‌ నడుస్తోంది. ఆ ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్‌(NCW) తీవ్రంగా స్పందించింది.

న్యూఢిల్లీ: నేవీ అధికారి వినయ్‌ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్‌ మీడియా ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. జమ్ము కశ్మీర్‌ పహల్గాం ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు.  లెఫ్టినెంట్‌ వినయ్‌ అగర్వాల్‌ను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడితో యావత్‌ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వినయ్‌ భార్య హిమాన్షిని సోషల్‌ మీడియాలో కొందరు టార్గెట్‌ చేయడం దుర్మార్గం.

కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్‌ చేయడం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయడం సరికాదు అని ఎన్‌సీడబ్ల్యూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా గౌరవాన్ని, ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్‌ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు.. కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ కూడా తన సోషల్‌ మీడియా ఖాతాలో ఈ ఉదంతంపై స్పందించారు.

 

 

నేవీ అధికారి వినయ్‌ నర్వాల్‌ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..  తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గానూ సోషల్‌ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ పోస్టులు చేయసాగారు.

గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్‌డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement