
న్యూఢిల్లీ: జాతీయ విద్యా పరిశోధన శిక్షణామండలి(ఎన్‌సీఈఆర్‌టీ)ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా బోర్డులకు సమానంగా వర్తించే 10, 12వ తరగతుల సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య, సాక్షరతా విభాగం ఈమేరకు ఈ–గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించింది.
10, 12వ తరగతుల సర్టిఫికెట్లను జారీ చేసే బాధ్యతను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ)కు అప్పగిస్తూ 2021 నవంబర్ 15వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఇది భర్తీ చేయనుంది. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, చట్ట ప్రకారం ఏర్పాటైన ప్రైవేట్ భారతీయ స్కూల్ బోర్డులకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపింది. ఎన్‌సీఈఆర్‌టీ జారీ చేసిన సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా ఒకే రీతిలో పరిగణిస్తారు. దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల వలసలు సజావుగా సాగటానికి ఇది తోడ్పడుతుందని ఎన్‌సీఈఆర్‌టీ స్పష్టం చేసింది.