
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం తాజాగా రాష్ట్ర విద్యా విధానాన్ని విడుదల చేసింది. ఇది జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించింది. సైన్స్, ఏఐ, ఆంగ్ల విద్య ప్రాముఖ్యతలను నొక్కి చెబుతూ, ద్విభాషా విధానానికి మొగ్గుచూపింది. తమిళనాడు రాష్ట్ర విద్యా విధానం (ఎస్‌ఈపీ)ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం అన్నా సెంటెనరీ లైబ్రరీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. ఇది కేంద్ర జాతీయ విద్యా విధానానికి(ఎన్‌ఈపీ) నిర్ణయాత్మక విరామంలాంటిది.
ఈ నూతన విద్యావిధానం రూపకల్పనకు రిటైర్డ్ జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని 2022లో ఏర్పాటు చేశారు. ఈ నూతన విద్యావిధానం త్రిభాషా సూత్రాన్ని తిరస్కరించింది. ద్వి భాషా విధానానికి కట్టుబాటును ప్రకటించింది. ఈ విధానంలో 11, 12 తరగతుల మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలను సిఫారసు చేసింది. ఈ విధానం విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా రూపొందించారు.
3, 5, 8 తరగతుల్లో పబ్లిక్ పరీక్షల ప్రతిపాదనను మురుగేశన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ముందస్తు పరీక్షలు డ్రాపౌట్ రేట్లను పెంచుతాయని విద్యను వాణిజ్యీకరించే అవకాశాలున్నాయిని అభిప్రాయపడింది. విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితాకు బదిలీ చేయాలని కూడా మురుగేశన్ కమిటీ సిఫారసు చేసింది. కాగా జాతీయ విద్యావిధానం అమలు చేయని కారణంగా సమగ్ర శిక్ష పథకం కింద కేంద్రం రూ. 2,152 కోట్లను నిలిపివేసిందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై స్పందించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ .. కేంద్రం వెయ్యి కోట్లు ఇచ్చినా, తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయదని స్పష్టం చేశారు. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ విద్యా స్వాతంత్య్రాన్ని కొనసాగిస్తుందన్నారు.