
న్యూఢిల్లీ: ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ, పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020 కింద కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ తరహా భాషా వివాదం తలెత్తింది. అయితే ఈ త్రిభాషా విధానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ విధానాలకు మద్దతు పలికే ఆర్‌ఎస్‌ఎస్ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక భాషలలో ప్రాథమిక విద్యను కొనసాగించాలన్న వాదనను సమర్థిస్తూ, ఈ అంశంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలు జాతీయ భాషలే అంటూ, ఇదే సంఘ్ వైఖరని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలో సొంత భాషలోనే మాట్లాడుతుంటారు. అందుకే ప్రాథమిక విద్యను అదే భాషలో కొనసాగించాలని ఆయన అన్నారు.
#WATCH | Delhi: On the recent language controversy, RSS Akhil Bharatiya Prachar Pramukh, Sunil Ambekar says, "Sangh has always had the stand that all languages of India are national languages. People speak their own languages in their own places. Primary education should be… pic.twitter.com/PUZhWyv19p
— ANI (@ANI) July 7, 2025
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం కింద విద్యార్థులు తమ పాఠశాల విద్యలో మూడు భాషలు నేర్చుకోవాలి. జాతీయ ఐక్యతను సమతుల్యం చేస్తూ బహుభాషావాదాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. అయితే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించాయి. ప్రాథమిక విద్యలో స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అవి పట్టుబట్టాయి. ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఇదే ధోరణి ప్రదర్శించింది. అయితే ఈ తరహా భాషా సమస్యను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని, రాత్రికి రాత్రే జరగదని సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.