గోవా: ప్రముఖ నటుడు నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో గోవాలోని తన నివాసంలో తీవ్ర కార్డియాక్ అరెస్ట్‌కు గురై గురువారం ఉదయం మరణించారు. ఆయనకు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ‘ఏఎన్‌ఐ’ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? గుండెపోటుకు దీనికి మధ్య తేడా ఏమిటి? ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తొలి నిమిషాలు ఎందుకు కీలకమో వైద్యులు వివరించారు.
గుండె పనితీరు ఒక్కసారిగా నిలిచిపోతే..
కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె నుంచి రక్తాన్ని శరీరమంతటికీ సమర్థవంతంగా పంపించలేని అత్యవసర పరిస్థితి. ఇది కొన్నిసార్లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే సంభవించవచ్చు. గుండె నుంచి రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడు సహా ఇతర కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అందుకే తక్షణ వైద్య సహాయం అత్యవసరం.
గుండెపోటు.. కార్డియాక్ అరెస్ట్ ఒకటి కాదు!
ముంబై సెంట్రల్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పరిన్ సంగోయ్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్డియాక్ అరెస్ట్‌కు, గుండెపోటుకు మధ్య కీలకమైన తేడా ఉంది. గుండె విద్యుత్ సంకేతాల వ్యవస్థలో ఏర్పడే లోపం కారణంగా గుండె సక్రమంగా కొట్టుకోవడం ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్‌గా పేర్కొంటారు. గుండెపోటు సాధారణంగా గుండె కండరాలకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడటంతో సంభవిస్తుంది. గుండెపోటు కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు. అయితే ఈ రెండూ ఒకటే కావు.
ప్రతి నిమిషం ఎందుకు కీలకం?
పరేల్‌లోని గ్లెనీగిల్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ కార్డియోవాస్కులర్, థొరాసిక్ సర్జన్ డాక్టర్ స్వరూప్ స్వరాజ్ పాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కార్డియాక్ అరెస్ట్ సంభవించినప్పుడు ప్రతి నిమిషం కీలకమే. రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడు, ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. అందువల్ల అత్యవసర చికిత్సలో ఆలస్యం జరగకుండా చూడాలి.
సీపీఆర్ ప్రాణాలు కాపాడగలదా?
కార్డియాక్ అరెస్ట్ స్థితిలో ఉన్న వ్యక్తికి వెంటనే అత్యవసర వైద్య సహాయం అందించాలి. సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) ద్వారా ఛాతీపై ఒత్తిళ్లు కలిగించి రక్తప్రసరణను కొనసాగించేందుకు ప్రయత్నిస్తారు. ఇది ప్రాణాలు నిలిపే అవకాశాలను పెంచగలదు. అయితే ప్రతి సందర్భంలోనూ ఫలితం ఒకేలా ఉండదు. అవసరాన్ని బట్టి శిక్షణ పొందిన వ్యక్తులు సీపీఆర్ ప్రారంభిస్తూ అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి.
45 నిమిషాల ప్రయత్నించినా..
నానా పటేకర్ గురువారం ఉదయం 5.20 గంటలకు మరణించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఆయనకు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్ చేసినప్పటికీ తిరిగి ప్రాణాలు నిలబెట్టలేకపోయారని తెలిపింది. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు నమోదు చేసినట్లు, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


