సేవ వర్ధిల్లాల్సిన చోట స్వార్థమా! | Hospitals medical mafia no Selfishness only business | Sakshi
Sakshi News home page

సేవ వర్ధిల్లాల్సిన చోట స్వార్థమా!

Oct 20 2026 2:29 PM | Updated on Oct 20 2026 3:05 PM

Hospitals medical mafia no Selfishness only business

రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే గోవిందరావు రోడ్డు ప్రమాదానికి గురై కార్పొరేట్‌ ఆసుపత్రిని సంప్రదించాడు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికే లక్షల రూపాయల బిల్లులు పెండింగులో ఉన్నా యనే కారణం చేత ఉచిత వైద్యం చేయ టానికి అతని అధికారిక గుర్తింపు కార్డును ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు. ఖర్చు సుమారు మూడు లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్‌ చేస్తూ ఐదు లక్షల రూపాయలు బిల్లును గోవిందరావు చేతిలో పెట్టారు. సర్జరీ చేసిన డాక్టర్‌ ఫీజు, షుగర్‌ డాక్టర్‌ ఫీజు, మత్తు ఇచ్చిన డాక్టర్‌ ఫీజుతో పాటు ఆ డాక్టర్ల ఆపరేషన్‌ థియేటర్‌ విజిటింగ్‌ చార్జీలు వేలల్లో వేశారు. ఏ ఒక్కటీ వదలకుండా సర్జరీ సమయంలో డాక్టర్లు, నర్సులు ఉపయోగించిన మాస్కులు, గ్లౌజులు, వాడిన ఇంజక్షన్లు, మందుల ధరలు అన్నీ బిల్లులో చూపించారు. వాడినఇంజక్షన్లు, మందుల ధరలు రిటైల్‌ ధరలకు రెండింతలు అధికంగా చూపించారు. డాక్టర్ల ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు తిరిగి విజిటింగ్‌ చార్జీలు వసూలు చేయడమేమిటని గోవిందరావు బిల్లింగ్‌ గుమస్తాను ప్రశ్నించాడు. ‘‘మాకు తెలియదండి, డాక్టర్లను అడగండి’’ అని జవాబిచ్చాడు.

ఇదీ చదవండి: దసరా పండుగ : సింగర్‌ ఇంటికి కొత్త లగ్జరీ కారు

వైద్యం పేరిట వ్యాపారం
వృద్ధాప్యంలో వివిధ జబ్బులతో బాధ పడుతున్న తన తండ్రిని రాజేష్‌ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. ఇటీవలే చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులన్నీ పక్కకు పడేసి, దాదాపు పదిహేను రకాల పరీక్షలు అదే ఆసుపత్రిలో చేశారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చక పోతే పరిస్థితులు పక్షవాతానికి దారి తీస్తాయని, డాక్టర్‌ కరాకండిగా చెప్పటంతో విధిలేక ఒప్పుకున్నాడు. రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని, సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పటంతో ఇరవై ఐదు వేల రూపాయలు ముందస్తుగా డిపాజిట్‌ చేసి తండ్రిని అడ్మిట్‌ చేశాడు. మూడురోజులు గడిచాయి. నాలుగో రోజు రాజేష్‌ తండ్రిని నర్సులకు అప్పచెప్పి గంటలో వస్తానని ఇంటికి వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేసరికి తండ్రి మంచం మీదనుండి క్రింద పడ్డాడని, అందువల్ల ప్రాణం పోయిందని శవాన్నీ, ఐదు లక్షలరూపాయల బిల్లునూ అందించారు.

ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌ : ధనుష్‌ పొలిటికల్‌ ఎంట్రీపై టీవీకే స్పందన

‘‘నీకు ఇన్సూరెన్సు ఉందా?’’
ఈ సమస్యలు ఏ ఒకరిద్దరివో కావు. ఒక్కో కార్పొరేట్‌ ఆసుపత్రిలో రోజుకు వేలల్లో రోగులు. నయం కావటమేమో కానీ, వారి కుటుంబాలు కార్పొరేట్‌ మోసాలకు గురి అవుతున్నాయి. ముఖ్యంగా ఐసీయూలో ఏమి జరుగుతుందో రోగి బంధువులకు తెలియదు. డాక్టర్లు చెప్పిందే మనం నమ్మాల్సిన పరిస్థితి. స్టెత స్కోప్‌ను, థర్మామీటర్‌ను డాక్టర్లు ఎప్పుడో మరచిపోయారు. డాక్టర్లు రోగి నాడిని పట్టుకునే రోజులకు; కళ్ళు, నోరు పరీక్షించే రోజులకు ఎప్పుడో కాలం చెల్లింది. డాక్టర్‌ను సంప్రదించగానే మొదట ఓ పది రకాల పరీక్షలు రాయటం అలవాటైంది. ఆసుపత్రికి పోతే డాక్టర్‌ అడిగే మొదటి ప్రశ్న ‘‘నీకు ఇన్సూరెన్సు ఉందా?’’ అని. ఎందుకంటే ఇన్సూరెన్స్‌ ఉంటే ఎక్కువ బిల్లు దండుకోవచ్చు. చాలా ఆసుపత్రులు, వైద్యులు వైద్య వృత్తిని వ్యాపారంగా భావిస్తున్నా రనటంలో సందేహం లేదు. ప్రైవేటు ఆసుపత్రుల మీద ప్రభుత్వాల సరియైన నియంత్రణ లేకపోతే దాపురించే దుస్థితిని ప్రజలు అనుభవించాల్సిందే.

న్యాయవాదుల వృత్తిపరమైన ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ నియమ నిబంధనలు ఉన్నట్టుగానే, ఆసుపత్రులు, వైద్యుల వింత పోకడల ప్రచారాలను అరికట్టాలనే సదుద్దేశంతో జాతీయ వైద్య కమిషన్‌ కొన్ని నియమ నిబంధనలు ఈ మధ్య విడుదల చేసింది. వైద్య వృత్తిలో నైతికతను, నిజాయితీని కాపాడేటందుకు జాతీయ వైద్యకమిషన్‌ ఉల్లం‘ఘనుల’లపై కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • తడకమళ్ళ మురళీధర్‌ , విశ్రాంత జిల్లా జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement