
ప్రభుత్వ వైద్యురాలికి కట్న వేధింపులు
బలవంతంగా గర్భస్రావం
మైసూరులో భర్త, అత్తమామల దాష్టీకం
మైసూరు: పెళ్లయి కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లింది, కానీ రెండు నెలలకే అత్తింట్లో యువ వైద్యురాలు నరకాన్ని చూసింది. ఆమెకు వేధింపులకు గురి చేసి బలవంతంగా గర్భస్రావం చేయించిన భర్త, అత్తమామలతో పాటు ఐదుగురిపై మైసూరులోని సరస్వతీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
రూ.80 లక్షలతో పెళ్లి వేడుక
వివరాలు.. మండ్య జిల్లా కేఆర్ పేటె ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యురాలు నవ్య, ఆమె తండ్రి మహాదేవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవ్య భర్త అభిõÙక్, మామ గోవిందరాజు, అత్త లత, జ్ఞానశేఖర్, వైద్యురాలు లత అనేవారిపై కేసు నమోదైంది. నవ్యకు మైసూరులోని బిళికెరె నివాసి, బంగారు వ్యాపారి గోవిందరాజు కుమారుడు అభిõÙక్‌తో వివాహమైంది. మహాదేవ సుమారు రూ.80 లక్షలు ఖర్చు చేసి కుమార్తెకు ఘనంగా వివాహం చేశారు.
నీకు పిల్లలెందుకు అని
శుక్రవారం రాత్రి నవ్య మీడియాతో మాట్లాడుతూ వివాహమైన రెండు నెలల్లోనే నన్ను చిత్రవధ చేసిన భర్త, అతని కుటుంబ సభ్యుల నిజస్వరూపం ఏంటో చూశాను. డబ్బు కోసం తీవ్రంగా వేధించారు. తిరుపతికి వెళ్లాలి, సుదూర ప్రయాణం చేయాలంటూ అబద్ధం చెప్పి డబ్బులు తేవాలనేవారు. రూ.5 లక్షల వరకట్నం కూడా తేలేదు, నీకు పిల్లలెందుకు అని అబార్షన్ చేయించారు అని విలపించింది. మంగళసూత్రం, కాళ్ల ఉంగరాలు అన్నింటినీ తీసుకుని తనను నడివీధిలో వదిలేశారన్నారు. పెళ్లికి ముందు వైద్యురాలిగా ఉద్యోగానికి వెళ్లేదాన్నని, పెళ్లైన నాటి నుంచి ఉద్యోగాన్ని మాన్పించారు. ఒక వారం రోజులే తనను బాగా చూసుకున్నారని, తర్వాత రోజుకొక రకంగా హింసించారని రోదించింది.
వదిలేయండి అని వేడుకున్నా..
బలవంతపు అబార్షన్‌కు ఓ ఆస్పత్రి వైద్యులు జ్ఞానశేఖర్, లత సహకరించారని ఆరోపించారు. మీరు వేరే పెళ్లి చేసుకోండి, నేను మీ జోలికి రాను, విడాకులు ఇస్తాను, కడుపులోని నా బిడ్డకు ఏమీ చేయవద్దని భర్తను వేడుకున్నా వినలేదు. నా ప్రైవేట్ వీడియో అడ్డు పెట్టుకుని బలవంతం చేశారు, నాకు న్యాయం కావాలని, తన భర్త కుటుంబాన్ని శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.