ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం | Mumbai Drenched As Late Monsoon Unleashes Overnight Fury, Several Areas Waterlogged, More Details Inside | Sakshi
Sakshi News home page

ముంబైపై వరుణుడి దండయాత్ర.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Jun 24 2026 8:01 AM | Updated on Jun 24 2026 12:43 PM

Mumbai Drenched Late Monsoon Unleashes Overnight Fury Key Areas Waterlogged

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు రుతుపవనాల రాక ఉపశమనం కలిగించినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ శివారు ప్రాంతాల్లో అత్యధికంగా 190 మిల్లీమీట‌ర్ల‌, తూర్పు శివారు ప్రాంతాల్లో 154 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, నగరవ్యాప్తంగా సగటున 184 మి.మీ. మేర భారీ వర్షం కురిసింది. దీంతో పలు కీలక రహదారులపై ట్రాఫిక్ నెమ్మదించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 

అర్ధరాత్రి ముంచెత్తిన వాన.. జలమయమైన రోడ్లు
మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా హింద్‌మాతా, మాతుంగా, కుర్లా, అంధేరి వంటి ప్రాంతాల్లో వీధులన్నీ చెరువులను తలపించాయి. ఈ ఆకస్మిక వరద పరిస్థితి కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ ముంబైలోని నాయర్ హాస్పిటల్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్య అత్యధికంగా 78.96 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఎన్ఎమ్ జోషి మార్గ్-లోయర్ పరేల్‌లో 78.4 మి.మీ, పరేల్ టీటీలో 72.63 మి.మీ, పశ్చిమ శివారులోని మలాడ్ బస్ డిపో వద్ద 61.8 మి.మీ వాన పడింది.

 


13 రోజులు ఆలస్యంగా రుతుపవనాల ఎంట్రీ
సాధారణంగా జూన్ 10 నాడే ముంబైని తాకాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి 13 రోజులు ఆలస్యంగా మంగళవారం నాడు నగరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ముంబై చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన ప్రవేశం ఏమీ కాదు. 2023లో జూన్ 25న రుతుపవనాలు రాగా, అత్యంత సుదీర్ఘ ఆలస్యంగా 1958, 1974 సంవత్సరాల్లో జూన్ 28న రుతుపవనాలు ముంబైని తాకాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంతో పాటు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

అప్రమత్తమైన అధికారులు
భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముంబై నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది. ప్రధాన సబ్‌వేలన్నీ తెరిచే ఉన్నాయని, సబర్బన్ రైల్వే సర్వీసులు, బెస్ట్ బస్సులు ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తున్నాయని తెలిపింది. అయితే, రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో, లోతట్టు ప్రాంతాల్లోని వారు  అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: పిడుగుల ఊచకోత: ఒకే రోజు 11 మంది దుర్మరణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement