న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు శనివారం వెల్లడించారు.
"భారత ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలిపారు" అని ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
On the recommendation of the Govt of India, Hon’ble President, Smt. Droupadi Murmu ji has approved the summoning of both the Houses of Parliament for the Monsoon Session 2026.
The Session will commence on 20 July, 2026 and continue till 13 August, 2026 for meaningful debate,… pic.twitter.com/TaEYH4F1cK— Kiren Rijiju (@KirenRijiju) July 4, 2026
ఇదిలా ఉండగా, వివాదాస్పదమైన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) జూలై 17న తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు అరెస్టై వరుసగా 30 రోజుల పాటు న్యాయస్థాన కస్టడీలో ఉంటే, వారు ఆటోమేటిక్‌గా పదవిని కోల్పోవాలనే నిబంధనను యథాతథంగా ఉంచే సూచనలు కనిపిస్తున్నాయి.
జూలై 17న మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. చర్చల సమయంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, వివాదాస్పద నిబంధనను తొలగించాలని కమిటీ సిఫారసు చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే రాజకీయ కక్ష సాధింపు లేదా ఉద్దేశపూర్వక కేసుల పేరిట ఈ నిబంధనను దుర్వినియోగం చేయకుండా రక్షణ చర్యలను నివేదికలో చేర్చే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదిత సవరణపై తీవ్ర రాజకీయ చర్చ సాగింది. దీనికి మద్దతు ఇస్తున్న వారు ప్రజాప్రతినిధుల జవాబుదారీతనం పెరుగుతుందని వాదిస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్షం మాత్రం రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులు, అరెస్టుల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
జూలై 17న జరిగే సమావేశంలో జేపీసీ తన నివేదికను ఖరారు చేసి ఆమోదించిన తర్వాత పార్లమెంటుకు సమర్పించనుంది. అటు, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైనికుల ప్రాణనష్టంపై సభను తప్పుదోవ పట్టించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ "స్పష్టమైన అబద్ధం చెప్పారు" అని కాంగ్రెస్ ఆరోపించిన నేపథ్యంలో, ఆయనపై ప్రత్యేక హక్కుల ఉల్లంఘన చర్యల అంశాన్ని కూడా ప్రతిపక్షం పార్లమెంటులో ప్రస్తావించే అవకాశం ఉంది.


