మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Published Tue, Sep 19 2023 3:30 PM

Modi Speech In Rajya sabha New Parliament Kharge Women Reservation Bill - Sakshi

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్‌ భవనంలో రాజ్యసభ కొలువుదీరింది. ఈ సందర్భం​గా తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని అన​అన్నారు. పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. భారత్‌ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని.. రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారబోతోందని పేర్కొన్నారు. ఇందుకు కొత్త పార్లమెంట్‌ సాక్ష్యంగా నిలవబోతోందని తెలిపారు

మేకిన్‌ ఇండియా గేమ్‌ ఛేంజర్‌గా మారిందన్నారు ప్రధాని మోదీ. 2047లో భారత్‌ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. కొత్త పార్లమెంట్‌లోనే  స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పారు.  మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టామని, ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేశామని ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో మహిళలతే కీలక పాత్ర ఉండబోతుందన్నారు. 
చదవండి: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు

ఇదిలా ఉండగా సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికి.. నేడు  కొత్త భవనంలో అడుగుపెట్టారు. మంగళవారం నుంచి సభా కార్యకలాపాలు కొత్తపార్లమెంట్‌ వేదికగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరగనుంది. సెప్టెంబర్‌ 21న రాజ్యసభలో చర్చకు రానుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement