
ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కేంద్ర సహాయ మంత్రులు అర్జున్‌రామ్ మేఘ్వాల్, ఎల్. మురుగన్
కీలకాంశాలపై పార్లమెంట్‌లో చర్చిస్తాం: కేంద్రం
నేటి నుంచే వర్షాకాల సమావేశాలు
8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం కూడా.. సజావుగా సాగేందుకు సహకరించండి
అఖిలపక్ష భేటీలో విపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి
సిందూర్, ట్రంప్ వ్యాఖ్యలు,బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై చర్చించాల్సిందే
పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ప్రకటన చేయాలి: విపక్షాలు
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలకాంశాలపై పార్లమెంట్‌లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. విపక్షాల ప్రశ్నలన్నింటికీ మేం సమాధానం ఇస్తాం. అయితే పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న రోజుల్లో మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారు.
– కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ స్పందించాలి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్చించాలి.
– గౌరవ్ గొగోయ్, కాంగ్రెస్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు కొనసాగుతాయి. పహల్గాం ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ లేవనెత్తాల్సిన కీలక అంశాలపై విపక్షాలు కసరత్తు పూర్తిచేశాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనపై వర్షాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు.
నిర్మాణాత్మక చర్చలకు సహకరించాలి
వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు, ఉభయ సభల్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్వాల్, మురుగన్‌తోపాటు కాంగ్రెస్ ఆర్జేడీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్‌సీపీ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ, బీఆర్‌ఎస్, శివసేన(షిండే), ఆమ్ ఆద్మీ తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు.
విపక్షాలు తమ ఎజెండాను ప్రస్తావించాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పహల్గాం ఉగ్రవాద దాడి, భారత్–పాక్ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను లేవనెత్తాయి. పొరుగు దేశాలతో విదేశాంగ విధానం, తాజా పరిస్థితులపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, దేశ ఆర్థిక వ్యవస్థ, మణిపూర్ అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించాలని కోరాయి.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ చేపట్టాలని డీఎంకే అభ్యర్థించింది. అఖిలపక్ష భేటీ అనంతరం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. భారత్–పాక్ మధ్య యుద్ధం ఆపేశానంటూ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు దారితీసిన భద్రతా లోపాలు, బిహార్‌లో ఓట్ల జాబితా సవరణపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.అఖిలపక్ష భేటీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, ఎంపీలు జైరాం రమేశ్ తదితరులు
కొత్త బిల్లులు
వర్షాకాల సమావేశాల్లో కేంద్రం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు, జన్ విశ్వాస్(నిబంధనల సవరణ) బిల్లు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(సవరణ) బిల్లు, పన్నుల చట్టాలు(సవరణ) బిల్లులతో పాటు జియోహెరిటేజ్ సైట్స్, జియో–రెలిక్స్(సంరక్షణ), జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక(సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనుంది.
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం కోరనుంది. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న సముద్ర వస్తువుల రవాణా బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, ఓడరేవుల బిల్లులపై చర్చించి, ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.
చర్చకు వెనుకాడం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
ఆపరేషన్ సిందూర్ సహా జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు అధికార, విపక్ష సభ్యులు కలిసికట్టుగా పని చేయాలన్నారు.
వర్షాకాల సమావేశాలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పార్టీలకు, కూటములకు వేర్వేరు సిద్ధాంతాలు ఉన్నప్పటికీ పార్లమెంట్ కార్యకలాపాలకు సహకరించాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా ఉందన్నారు. ఉభయ సభల్లో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని చిన్న పార్టీల ఎంపీలు కోరారని, అందుకోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
చిన్న ఎంపీలకు తగినంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయంలో ప్రధాని మోదీ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కిరణ్ రిజిజు వెల్లడించారు. విపక్షాలు లేవనెత్తే అంశాలపై సంబంధిత కేబినెట్ మంత్రులు సమాధానం ఇస్తారని స్పష్టంచేశారు. 17 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.