
ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రాంతాలను పాక్ టార్గెట్ చేసిందని.. ఉత్తర, పశ్చిమ, భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్య స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశామని ఆమె స్పష్టం చేశారు. విదేశాంగశాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాక్ దాడులను తిప్పికొట్టామని.. పాక్ మిస్సైళ్లను కూల్చేశామని వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరుపుతున్న విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 16 మంది మృతి చెందినట్లు ఆమె వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి,భుజ్‌లో పాక్ సైన్యం దాడులు చేసిందని.. మేం చేసిన దాడులు ఎక్కడా రెచ్చగొట్టేలా లేవన్నారు.
నియంత్రణ కచ్చితత్వంతో మేం కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. మిలటరీ స్థావరాలపై మేం దాడి చేయలేదు. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. కుప్పారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సెక్టార్లలో పాక్ సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ తనకేమీ సంబంధం లేదంటూ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోందని విక్రమ్ మిస్త్రీ అన్నారు.
‘‘పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. ఇంతకంటే ధీటుగా సమాధానం ఇస్తాం. 65 ఏళ్ల నుంచి భారత్‌ను పాక్ రెచ్చగొడుతున్నా సహనంగా ఉన్నాం. పాకిస్థాన్‌తో ఎలాంటి దౌత్యపరమైన చర్చలు జరపడం లేదు. ఐరాసతోనే పాకిస్థాన్ అబద్ధాలు చెప్పింది. పాక్‌లో ఉన్న టీఆర్‌ఎఫ్.. లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్రం. మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదులు పాక్‌లో రక్షణ పొందుతున్నారు.
బిన్ లాడెన్‌కు కూడా పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. పాకిస్థాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులే.. పఠాన్‌కోట్, ముంబైలో దాడులు చేశారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ అధికారులు హాజరయ్యారు. ఉగ్రవాదులకు అధికార లాంఛనాలతో పాక్ అంత్యక్రియలు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేశామని అబద్ధాలు చెప్తోంది. మేం ఎక్కడా ప్రార్థనా కేంద్రాలను టార్గెట్ చేయలేదు. పూంఛ్‌లో సిక్కు పౌరులపై పాక్ కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు సిక్కులు చనిపోయారు, పహల్గాం ఉగ్రదాడి వల్లే ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. పల్గాహం ఉగ్రదాడికి నిన్న భారత్ సమాధానం చెప్పింది’’ అని విక్రమ్ మిస్త్రీ చెప్పారు.